6న రీపోలింగ్, 7న ఓట్ల లెక్కింపు
రాష్ర్ట ఎన్నికల కమిషన్ ప్రకటన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల షెడ్యూల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. నవంబరు 3న జరగాల్సిన పోలింగ్‌ను 5వ తేదీకి, అవసరమైతే నిర్వహించే రీపోలింగ్‌ను 4 నుంచి 6వ తేదీకి, ఓట్ల లెక్కింపును 5 నుంచి 7వ తేదీకి మారుస్తూ బుధవారం సవరించిన నోటిఫికేషన్ జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబరు 3న జరగనున్న నేపథ్యంలో పోలీసు, పోలింగ్ సిబ్బంది కొరత ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 5న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైతే 6న రీపోలింగ్ నిర్వహిస్తారు. 7న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాల్లో 44, పోలవరం జిల్లాలోని 7 మండలాల్లో మరో 44 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం పోలింగ్ సమయం మధ్యాహ్నం 3 గంటలకే ముగుస్తుంది. ఈ కేంద్రాల్లో రీపోలింగ్ అవసరమైనా అదే సమయానికి ముగించాల్సి ఉంటుంది. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తుపాను ప్రభావిత పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో చర్చించామని, వారిచ్చిన సమాచారం మేరకు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేయాల్సిన అవసరం లేదని తెలిపారు.








కామెంట్‌లు (0)