ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్
ప్రజాశక్తి - అనంతపురం : నవంబర్ 1 న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు నవంబర్ 2 న ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఎపి స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ ప్రభుత్వాన్ని, ఎన్నికల అధికారులను కోరారు. గురువారం విజయ్ భాస్కర్ ప్రజాశక్తితో మాట్లాడుతూ .... ఎన్నికల విధుల్లో భాగంగా పోలింగ్ సామగ్రి స్వీకరణ, పోలింగ్ నిర్వహణ, అనంతరం సామగ్రి అప్పగింత వంటి బాధ్యతలను ఉద్యోగులు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో ఎక్కువ సమయం విధుల్లో ఉండటంతోపాటు, దూర ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఉద్యోగుల శ్రమను గుర్తించి, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 2 న ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఉద్యోగులకు విశ్రాంతి లభించడంతో పాటు ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయని విజయ్ భాస్కర్ తెలిపారు.








కామెంట్‌లు (0)