కొత్త బ్యాలెట్ పేపర్లతో మరలా పోలింగ్
ప్రజాశక్తి- యంత్రాంగం : కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల్లో మూడవ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి గుర్తును సైకిల్‌కు బదులు కమలం గుర్తును ప్రచురితం చేశారు. 404 ఓట్లు పోలైన తరువాత అధికారులు ఈ తప్పును గుర్తించారు. వెంటనే పోలింగ్ నిలిపేశారు. గంట తరువాత కొత్త బ్యాలెట్ పేపర్లను తీసుకొచ్చి మరలా పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటల వరకూ పోలింగ్ జరిగింది. విజయవాడ 55వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు ముందు హస్తం గుర్తు, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట ఫ్యాన్ గుర్తు ముద్రించారు. వైసిపి అభ్యంతరం తెలపడంతో పోలింగ్‌ను నిలిపివేశారు. సుమారు రెండు గంటల తర్వాత కొత్త బ్యాలెట్ పేపర్లను తీసుకురావడంతో పోలింగ్ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆ డివిజన్లో రాత్రి 7.30 గంటల వరకు పోలింగ్‌కు అనుమతిస్తూ ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మిగనూరులో దొంగ ఓట్లు కలకలం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు 26వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్న టిడిపి నేతలను వైసిపి అభ్యర్థి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైసిపి నియోజకవర్గ ఇంఛార్జి ఎర్రకోట రాజీవ్‌రెడ్డి పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. వైసిపి మహిళ నేతలు నిరసన తెలపడంతో వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. కర్నూలు కార్పొరేషన్ 13వ వార్డులో ఓ మహిళ ఓటును ఇతరులు వేయడంతో ఆమె నిరసన తెలిపారు. 31వ వార్డులో ఇద్దరు మహిళల ఓట్లను మరొకరు వేయడంతో వారు పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు.







కామెంట్‌లు (0)