చర్యలకు సిపిఎం డిమాండ్
డిజిపికి వి.శ్రీనివాసరావు లేఖ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపార్టీ నాయకులు దాడులు చేస్తున్నా ఏ మాత్రం స్పందించకుండా ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిజిపికి సోమవారం లేఖ రాశారు. కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులు నామినేషన్ వేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక చోట్ల దౌర్జన్యాలు, దాడిచేశారని, నామినేషన్ పత్రాలు చించి వేశారని ఈ లేఖలో ఆయన పేర్కొన్నారు. తమ కళ్లముందే ఈ సంఘటనలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిజిపిని ఆయన కోరారు.
దాడులపై ఫిర్యాదు చేసినా కనీసం స్పందన లేదని, కేసులు నమోదు చేయలేదని, ఈ ఘటనలపై ప్రత్యక్షంగా విచారించాలని, దాడులకు పాల్పడిన తెలుగుదేశం నాయకులను అరెస్టు చేసి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దాడులకు సంబంధించిన వివరాలు
(1) పూతలపట్టు ఎండిఓ ఆఫీసులో సిపిఎం అభ్యర్థి ఎంపిటిసికి నామినేషన్ వేస్తుండగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వి.గంగరాజుని పూతలపట్టు ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారు.
(2) మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఎంపిటిసి నామినేషన్‌కు వెళ్లిన సిపిఎం నాయకులు పి.ఆవులయ్యపై టిడిపి గూండాలు రాళ్ళతో దాడిచేయడంతో తలకు తీవ్రగాయమై ప్రణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు.
(3) కడప జిల్లా బద్వేలులో నామినేషన్‌కు వెళ్ళిన అభ్యర్థిని, వామపక్ష పార్టీల నాయకులను గూండాలు అడ్డుకొని నామినేషన్ పత్రాలు చించి వేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
(4) కనిగిరి 29వ వార్డులో పోటీచేస్తున్న సిపిఎం అభ్యర్థి పి.నరేంద్రకు మద్దతుగా వెళ్లిన సిపిఎం పట్టణ కార్యదర్శి కేశవరావు వద్ద రశీదులను చించి బయటకు గెంటేశారు. కనీసం పోలీసులు జోక్యం చేసుకోలేదు.
(5) పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు, ఎర్రబాలెం, పెరికపాడు స్థానాలకు నామినేషన్లు వేసేందుకు వెళ్లిన సిపిఎం అభ్యర్థులపై తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం చేసి, నామినేషన్ పత్రాలు చించి ఆఫీసు నుండి తరిమేశారు. అడ్డుకున్న సిపిఎం నాయకులు లక్ష్మీశ్వరరెడ్డి, నాయక్‌లపై పోలీసులు దాడి చేశారు. ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు.
(6) పల్నాడు జిల్లా సత్తెనపల్లి, ముప్పాళ్ల, క్రోసూరు జెడ్‌పిటిసి సిపిఎం అభ్యర్థులు నామినేషన్ వేయకుండా తెలుగుదేశం నాయకులు అడ్డుకొని ఫారాలు చించివేశారు. క్రోసూరు అభ్యర్థి గంజిమాల రవిబాబును కులం పేరుతో దూషించి నామినేషన్ పత్రాలు చించేశారు. కులం పేరుతో దూషించిన వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసును పెట్టాలి.
(7) మార్కాపురం పామూరులో సిపిఎం అభ్యర్థుల నామినేషన్‌ను టిడిపి నాయకులు అడ్డుకొని నామినేషన్ పత్రాలను చించి, మహిళా అభ్యర్థిని గాయపర్చి అసభ్యంగా మాట్లాడుతూ మెడకు కండువా వేసి హత్యాయత్నం చేశారు.
(8) కర్నూలు జిల్లా కొసిగి మండలం 5వ, 6వ ఎంపిటిసి స్థానాలకు నామినేషన్ వేసేందుకు వెళ్లిన సిపిఎం అభ్యర్థులను తెలుగుదేశం నాయకులు దౌర్జన్యంగా నామినేషన్ పత్రాలను గుంజుకొని చించేశారు. స్థానిక సిఐని రక్షణ కల్పించాలని కోరినా స్పందించలేదు.
(9) మార్కాపురం సిఎస్‌పురం మండలంలో సిపిఎంతో సహా ఇతర అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు.
(10) గుత్తిలో సిపిఎం అభ్యర్థిని నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్నారు.
(11) సత్తెనపల్లి మండలం జెడ్‌పిటిసి అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్లగా తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఏ చర్యా తీసుకోలేదు.
(12) తిరుపతి కార్పొరేషన్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.
(13) కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జెడ్‌పిటిసి నామినేషన్‌కు వెళ్లిన తెలుగుదేశం నాయకులు నామినేషన్ పత్రాలు చించేశారు.








కామెంట్‌లు (0)