ప్రతిరోజూ పర్యవేక్షించాలని హైకోర్టును ఆదేశిస్తాం
విస్తృత విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
సిసిటివి ఫుటేజీ భద్రపరచాలని సూచన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా చూడటానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అవసరమైన అన్ని ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ప్రతిరోజూ పర్యవేక్షించాలని హైకోర్టును ఆదేశిస్తాం’ అని సిజెఐ సూర్యకాంత్ తెలిపారు. వైసిపి అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలపై విస్తృత విచారణ చేపట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలపై వివాదాలున్నాయని, అభ్యర్థులను అక్రమంగా పోటీకి దూరం చేశారన్న ఆరోపణలను ప్రస్తుత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విచారణలో ఒక్కొక్కటిగా పరిశీలించడం సాధ్యం కాదని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను పరిరక్షించేందుకు సమగ్ర మార్గదర్శకాలు రూపొందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. నామినేషన్ కేంద్రాల్లోని సిసిటివి ఫుటేజీని భద్రపరిచే అంశాన్ని ప్రస్తావించింది. వైసిపి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి మోహనతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. వైసిపి అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారన్న ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) తీసుకున్న చర్యలను ధర్మాసనం పరిశీలించింది. ‘ఆధారాలు వెతుక్కుంటూ విస్తృత విచారణ చేపట్టే ఆదేశాలు ఇవ్వలేం. ఈ తరహా పరిస్థితులు పునరావృతం కాకుండా పాటించాల్సిన మార్గదర్శకాలు జారీ చేస్తాం’ అని సిజెఐ పేర్కొన్నారు.
నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలని ధర్మాసనం అభిప్రాయపడింది. నామినేషన్లు దాఖలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ అడ్డుకున్నారని నిరూపించాల్సిన బాధ్యత సంబంధిత అభ్యర్థులపై ఉంటుందని పేర్కొంది. బాధిత అభ్యర్థులు తగిన సమయంలో ఎన్నికల పిటిషన్లతో న్యాయపరమైన పరిష్కారం కోరవచ్చని స్పష్టం చేసింది. వైసిపి తరపున సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డంకులు ఎదుర్కొన్నారని తెలిపారు. రెండో విడత ఎన్నికల్లో జెడ్‌పిటిసి, ఎంపిటిసి తదితర స్థానాలకు సంబంధించి సుమారు 1,600 మంది అభ్యర్థుల్లో 1,200 మందిని నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని ప్రస్తావించారు. పంజాబ్ ఎన్నికల సందర్భంగా అనుసరించిన విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు పంజాబ్ కేసుకు భిన్నంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. ప్రతి అభ్యర్థి ఫిర్యాదును ఈ దశలో విచారించడం ఎన్నికల ప్రక్రియలో అనిశ్చితికి దారితీస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నివేదించారు. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించామని అన్నారు. నామినేషన్ల సమయం ముగిసినందున ఇక ఎన్నికల్లో పోటీచేయండని, ‘ఆల్ ది బెస్ట్’ అని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని, సిసిటివి పుటేజ్‌ను కూడా భద్రపరచాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, న్యాయబద్ధతను కాపాడేందుకు సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.








కామెంట్‌లు (0)