సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిపిఎం గెలుపుతోనే బాక్సైట్, హైడ్రో పవర్‌ ప్రాజెక్టులకు అడ్డుకట్ట

3 గంటల క్రితం

సిపిఎం గెలుపుతోనే బాక్సైట్, హైడ్రో పవర్‌ ప్రాజెక్టులకు అడ్డుకట్ట 
- గిరిజన హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న వారిని ఆదరించండి 
- జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి అభ్యర్థుల ప్రచారంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 12:16 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • గిరిజన హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న వారిని ఆదరించండి

  • జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి అభ్యర్థుల ప్రచారంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - చింతపల్లి, జికె.వీధి (అల్లూరి జిల్లా) : అల్లూరి జిల్లా జికె.వీధి మండలంలో బాక్సైట్ తవ్వకాలు, హైడ్రో పవర్‌ ‌ప్రాజెక్టుల పేరిట ఆదివాసీల జీవనాధారమైన అడవులు, వ్యవసాయ భూములు, గ్రామాలకు ముప్పు పొంచి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా జికె.వీధి మండలంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ బలపరిచిన జెడ్‌‌పిటిసి అభ్యర్థి అంపురంగి బుజ్జిబాబు, ఎంపిటిసి అభ్యర్థి కొర్ర నీలకంఠం తరఫున సోమవారం జికె.వీధి, ఆర్‌‌వి.నగర్ ప్రాంతాలతోపాటు వారపు సంతల్లో విస్తృతంగా ఆయన నప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి బుజ్జిబాబు, నీలకంఠంను గెలిపించాలని కోరారు. జికె.వీధి మండల భవిష్యత్తు, ఆదివాసీల హక్కులు, ఈ ప్రాంత సహజ వనరుల పరిరక్షణ స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో కార్పొరేట్ సంస్థలు ఏజెన్సీ ప్రాంతంలోని అడవులు, వ్యవసాయ భూములు, గిరిజన గ్రామాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకోవాలంటే ప్రజలు తమ హక్కుల కోసం ఐక్యంగా నిలవాలని కోరారు. పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ... ఇంగ్లాండ్ అప్పీలేట్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బాక్సైట్‌కు సంబంధించి రూ.2,600 కోట్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆ తీర్పుపై ప్రభుత్వాల నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడాన్ని ప్రశ్నించారు. వైసిపి ఈ అంశంపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. అదాని, అంబాని వంటి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ఏజెన్సీ ప్రాంతంలోని అటవీ, ఖనిజ సంపదలను కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. పంచాయతీ, మండల, జిల్లా స్థాయిల్లో గిరిజన ప్రయోజనాలకు అనుకూలంగా తీర్మానాలు చేయాలంటే స్థానిక సంస్థల్లో ప్రజల సమస్యలపై పోరాడే ప్రతినిధులు ఉండాలని పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ.. జిఒ 3 రిజర్వేషన్‌ ‌పునరుద్ధరణ కోసం, బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమాల్లో సిపిఎం కీలకంగా వ్యవహించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్