ఎన్నికల ఫలితాలపై సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూటమి ప్రభుత్వం అందిస్తోన్న సుపరిపాలనకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ద్వారా మద్దతు తెలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలపై మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్పందించారు. అనునిత్యం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ కృషిని గుర్తించే ప్రజలు కూటమికి అండగా నిలిచారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందనే నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉందని, అందుకే పట్టణ ప్రాంత స్థానిక ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించిందని చెప్పారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నామని అన్నారు. రాజకీయాలా.. ప్రజా సమస్యల పరిష్కారమా.. అని నిర్ణయించుకోవాల్సి వస్తే తాను సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రజలకు సేవలందించే క్రమంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని గుర్తించి సరిదిద్దుకుంటున్నామని, ప్రజలు మెచ్చే పాలన అందించడంతో పాటు వారి ఇబ్బందులను తొలగించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మంచి చేస్తే.. ప్రజలే తమకు అండగా నిలుస్తారనేది తన నమ్మకం అన్నారు. ఇదే విధంగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.








కామెంట్‌లు (0)