సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభారీ బందోబస్తు నడుమ రీ పోలింగ్‌

7 గంటల క్రితం

భారీ బందోబస్తు నడుమ రీ పోలింగ్‌
- తిరుపతిలో 50.38, కడపలో 65.84 
అనంతపురంలో 52.85, చీమకుర్తిలో 73.44, మాచర్లలో 59 శాతం నమోదు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 08:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • తిరుపతిలో 50.38, కడపలో 65.84

  • అనంతపురంలో 52.85, చీమకుర్తిలో 73.44, మాచర్లలో 59 శాతం నమోదు

ప్రజాశక్తి - యంత్రాంగం : పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు చోట్ల ఆదివారం జరిగిన ఘర్షణలు, రిగ్గింగ్‌తో ఐదు జిల్లాల్లోని ఏడు పట్టణ స్థానిక సంస్థలకు చెందిన 12 వార్డుల్లోని 13 పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు నడుమ సోమవారం రీ పోలింగ్ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. సోమవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరిగింది. పోలింగ్ పూర్తయిన వెంటనే పోలీస్ బందోబస్తు నడుమ కౌంటింగ్‌ కేంద్రానికి బాక్స్‌లను తరలించారు.

కడప నగర పాలక సంస్థలో ఒక డివిజన్‌, జమ్మలమడుగులో మూడు వార్డులు, పులివెందులలో నాలుగు వార్డుల్లో రీపోలింగ్‌ ‌నిర్వహించారు. కడప నగర పాలక సంస్థలో 996 మంది ఓటర్లకు గాను 693 మంది, జమ్మలమడుగు మున్సిపాలిటీలోని మూడు వార్డులకు సంబంధించి 1837 మంది ఓట్లరకు గాను 1247 మంది, పులివెందుల మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో 3039 మంది ఓటర్లకు గాను 1926 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా మూడు మున్సిపాలిటీల్లో సగటున 65.84 శాతం పోలింగ్ నమోదైంది.

అనంతపురం కార్పొరేషన్‌ ‌పరిధిలోని 30వ వార్డు మూడవ పోలింగ్‌ ‌కేంద్రంలో రీపోలింగ్‌ ‌ప్రశాంతంగా ముగిసింది. ఈ కేంద్రంలో బిజెపి నాయకులు ఆదివారం రిగ్గింగ్‌‌కు పాల్పడడంతో రీపోలింగ్‌ ‌జరిగింది. 52.85 శాతం పోలింగ్‌ నమోదైంది. తిరుపతి నగరపాలక సంస్థ 36వ వార్డులోని 4వ పోలింగ్ బూత్‌ శ్రీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ లో ఆదివారం చోటు చేసుకున్న ఘర్షణలు, సిసిటివి కెమెరాల ధ్వంసం, రిగ్గింగ్‌‌తో సోమవారం భారీ భద్రత నడుమ రీ పోలింగ్‌ ‌నిర్వహించారు. ఈ కేంద్రంలో మొత్తం 925 ఓట్లకుగాను 466 ఓట్లు పోలయ్యాయి. రీ పొలింగ్‌ ‌రోజు కూడా అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు.

ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపాలిటీ 14వ వార్డుకు జరిగిన రీపోలింగ్‌లో 900 ఓట్లకు 661 ఓట్లు నమోదయ్యాయి.73.44 శాతం పోలింగ్ నమోదైంది. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 23వ వార్డులోని రెండు పోలింగ్‌ ‌కేంద్రాల్లో జరిగిన అక్రమాల నేపథ్యంలో రీ పోలింగ్‌ ‌నిర్వహించారు. 59.54 శాతం ఓటింగ్‌ ‌నమోదైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్