ఓట్ల లెక్కింపు నిలిపివేతకు హైకోర్టులో పిటిషన్
తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం
ప్రజాశక్తి -కడప ప్రతినిధి/పులివెందుల టౌన్ : వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. లెక్కింపును నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో 80 పోలింగ్ బూత్ లకు గాను 70 బూత్‌లలో తమ ఏజెంట్లను టిడిపి నాయకులు అడ్డుకుని, అధికార పత్రాలు చించేశారని, బోగస్ ఓట్లు వేశారని వైసిపి ఆరోపించింది. తమ నియోజకవర్గ పరిధిలోని 70 బూత్ లలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసినా అధికారులు కేవలం నాలుగు బూత్ లకు మాత్రమే పరిమితమై రీపోలింగ్ నిర్వహించారని, అధికారుల నిర్ణయం సరికాదని వైసిపి నేతలు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రధాన పిటిషన్ దాఖలు కాగా దీనికి అనుబంధంగా వైఎస్‌ఆర్ కడప జిల్లా ఎంపి అవినాష్‌రెడ్డి తరఫున మరో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటింగ్ కొనసాగితే ఫలితాలపై ప్రభావం పడుతుందని, విచారణ పూర్తయ్యే వరకు లెక్కింపు ఆపడమే న్యాయసమ్మతమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఎన్నికల ప్రక్రియ సున్నితమైన అంశం కావడంతో, కౌంటింగ్ నిర్వహణపై స్పష్టతనిస్తూ మంగళవారం ఉదయం 7.30 గంటలకు తుది తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం పేర్కొంది.








కామెంట్‌లు (0)