న్యూఢిల్లీ : దేశంలో మరింత మన్నికైన, భద్రత కలిగిన పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలిదశలో రూ.10, రూ.20 నోట్లపై పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం అవసరమైన ప్రత్యేక పాలిమర్ షీట్ల సరఫరాకు ఆర్బీఐ అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్ఎంపీఎల్) గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ)ను ఆహ్వానించింది. అధునాతన భద్రతా ప్రమాణాలతో కూడిన ఒపాసిఫైడ్ బైయాక్సియల్లీ ఓరియెంటెడ్ పాలీప్రొఫైలిన్ (బీఓపీపీ) పాలిమర్ షీట్ల కోసం ఈ టెండర్‌ను విడుదల చేసింది. రెండు రకాల డినామినేషన్లకు కలిపి 68 వేల రీముల మెటీరియల్ అవసరమని పేర్కొంది. బిడ్ల దాఖలుకు ఆగస్టు 18ను గడువుగా నిర్ణయించింది.
మొదట రూ.10, రూ.20 నోట్లపై ప్రయోగం
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం .... ఎక్కువగా చలామణిలో ఉండే రూ.10, రూ.20 నోట్లతోనే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశముంది. ఈ నోట్లు త్వరగా చిరిగిపోవడం, వినియోగంతో నాణ్యత కోల్పోవడం వల్ల వీటినే ముందుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించి, అవి విజయవంతమైతే 2027 నుంచి దశలవారీగా ప్లాస్టిక్ నోట్లను విస్తృతంగా చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ముద్రణ వ్యయం తగ్గించడమే లక్ష్యం ....
ప్రస్తుతం దేశంలో వాడుతున్న కరెన్సీ నోట్లు 100 శాతం పత్తి ఆధారిత కాగితంతో ముద్రిస్తున్నారు. రోజువారీ వినియోగంలో ఇవి త్వరగా చిరిగిపోవడం, మురికిగా మారడం వల్ల భారీ సంఖ్యలో పాత నోట్లను ఉపసంహరించి కొత్త నోట్లు ముద్రించాల్సి వస్తోంది. దీంతో కరెన్సీ ముద్రణ వ్యయం ఏటా పెరుగుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ ముద్రణపై రూ.6,372.8 కోట్లు ఖర్చు కాగా, అంతకుముందు ఏడాది ఇది రూ.5,101.4 కోట్లుగా నమోదైంది.
పాలిమర్ నోట్ల ప్రయోజనాలు ....
పాలిమర్ నోట్లు సాధారణ కాగితం నోట్లతో పోలిస్తే రెండు నుంచి ఐదు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. దీంతో ముద్రణ, పంపిణీ ఖర్చులు దీర్ఘకాలంలో తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవి నీరు, మురికికి తట్టుకునే లక్షణం కలిగి ఉండటంతో పాటు, క్లియర్ విండో వంటి ఆధునిక భద్రతా ఫీచర్ల కారణంగా నకిలీ చేయడం కూడా కష్టతరమవుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా సహా 50కిపైగా దేశాలు పాలిమర్ కరెన్సీని విజయవంతంగా వినియోగిస్తున్నాయి.
గతంలోనూ ప్రయత్నం ....
భారత్‌లో ప్లాస్టిక్ నోట్ల ప్రయోగం కొత్తది కాదు. 2012లో రూ.10 ప్లాస్టిక్ నోట్లను కొచ్చి, మైసూరు, జైపూర్ తదితర నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని ప్రతిపాదించినప్పటికీ సాంకేతిక కారణాలతో ఆ ప్రణాళిక అమలుకాలేదు.
కఠిన నిబంధనలు ....
తాజా టెండర్‌లో ఆర్బీఐ పలు కఠిన నిబంధనలు విధించింది. చైనా, పాకిస్థాన్‌లలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు టెండర్‌లో పాల్గొనే అర్హత ఉండదని స్పష్టం చేసింది. అలాగే ఆయా దేశాల నుంచి ముడిసరుకును సేకరించకూడదని పేర్కొంది. సరఫరా చేసే పాలిమర్ మెటీరియల్‌లో జంతువుల కొవ్వు ఉండకూడదనే షరతును కూడా విధించింది.








కామెంట్‌లు (0)