సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులని, అమాయకులను మోసం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ఇటువంటి మోసగాళ్లను కటకటాల వెనక్కి నెట్టినపుడు మాత్రమే సమాజ ప్రయోజనాలు నెరవేరుతాయని పేర్కొంది. తనపై గల పలు కేసులను ఒకటిగా చేసి, బెయిల్ ఇవ్వాలని కోరుతూ సైబర్ మోసానికి పాల్పడిన నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం తిరస్కరించింది. బీహార్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్‌ల్లో పలు సైబర్ కేసులను ఎదుర్కొంటున్న మనోజ్ కుమార్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నిందితులు అనుసరించే పద్దతులు కూడా ప్రత్యేకంగా వుంటాయని, అరెస్టులను తప్పించుకునేందుకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారుతూ వస్తారని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మోహనలతో కూడిన బెంచ్ పేర్కొంది. సైబర్ నేరాల బాధితులు దేశమంతా వున్నారని ఈ రాష్ట్రంలో మోసగించి, మరో రాష్ట్రానికి పారిపోతారని పేర్కొంది. డిజిటల్ అరెస్టు మోసగాళ్లకు సంబంధించిన కేసులన్నింటినీ సుమోటోగా పరిగణనలోకి తీసుకున్న బెంచ్ వారిపట్ల కఠిన వైఖరి అవలంబించింది. కోర్టు జోక్యం నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇందుకు సంబంధించిన ప్రధాన కేసులను సిబిఐకి నివేదించాయి. వివిధ దేశాలు, ఖండాలకు సంబంధించిన కేసులు కూడా ఇందులో వున్నాయి. ఇందుకు సంబంధించిన అంశం సుప్రీం కోర్టు వద్ద ఇంకా పెండింగ్‌లో వుంది.









కామెంట్‌లు (0)