డెహ్రాడూన్ : స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా.. దేశంలోని మారుమూల గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం అందకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల దుస్థితిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. అత్తారింటికి చేరుకోవడానికి ఓ నవవధువు ఏకంగా 18 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సి వచ్చింది.
డెహ్రాడూన్ సమీపంలోని బులహర్ గ్రామానికి చెందిన షర్మిలకు, చక్రాటా ప్రాంతంలోని మారుమూల ఉండవా గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవల వివాహమైంది. పెళ్లి వేడుకలు ముగిసిన అనంతరం కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో అత్తవారింటికి బయలుదేరిన ఆమెకు మార్గమధ్యంలోనే ఊహించని ఇబ్బంది ఎదురైంది. వాహనం లోఖండి ప్రాంతం వరకు మాత్రమే వెళ్లగలిగింది. అక్కడి నుంచి ఉండవా గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో వాహన ప్రయాణం సాధ్యం కాలేదు. దీంతో చేసేదేమీ లేక పెళ్లి దుస్తుల్లోనే కాలినడకన బయలుదేరింది.
బరువైన పెళ్లి లెహంగా ధరించి, రాళ్లు రప్పలతో కూడిన కొండ మార్గంలో సుమారు 18 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా షర్మిల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి వీడియో ద్వారా తన గ్రామ సమస్యను నేరుగా విన్నవించింది. "నేను ప్రస్తుతం లోఖండి నుంచి ఉండవా గ్రామానికి కాలినడకన వెళ్తున్నాను. మాలాంటి పరిస్థితి భవిష్యత్తులో మరెవరికీ రాకుండా మా గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించండి" అంటూ ముఖ్యమంత్రిని కోరింది.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం కల్పించలేకపోవడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రోడ్లు లేకపోవడం వల్ల గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వృద్ధులు అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక నవవధువు 18 కిలోమీటర్లు నడిచి అత్తారింటికి చేరుకోవాల్సిన పరిస్థితి.. ఆ గ్రామానికి రహదారి ఎంత అవసరమో చెప్పకనే చెబుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉండవా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








కామెంట్‌లు (0)