సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జైలుకు వెళ్లే ముందు అత్యద్భుతంగా కూతురి పెళ్లి .. ఏర్పాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే ..!

6 గంటల క్రితం

A spectacular wedding for his daughter just before heading to jail the arrangements will leave you stunned
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 03:05 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

బీహార్ : సాధారణంగా పెళ్లిళ్లంటే బంధువుల సందడి, విందు వినోదాలు కనిపిస్తాయి. కానీ బీహార్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే కుమార్తె వివాహం మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఏకంగా నాలుగు లక్షల మందికి విందు ఏర్పాటు చేయడంతో పాటు, గుర్రపు పందేలు నిర్వహించి విజేతలకు ఖరీదైన బహుమతులు అందించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


మొకామా ఎమ్మెల్యే, జేడీయూ మాజీ నేత అనంత్ సింగ్ తన చిన్న కుమార్తె శివాంగి సింగ్ వివాహాన్ని నవంబర్ 25న బిహ్తాకు చెందిన రిషికేశ్ కుమార్‌తో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇదే రోజున తన పూర్వీకుల గ్రామమైన లడ్మాలో చిన్న కుమారుడి ఉపనయన కార్యక్రమాన్ని కూడా జరపనున్నారు.


ఈ వేడుకల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ నుంచి ప్రత్యేక డెకరేటర్లను రప్పిస్తుండగా, విదేశాల నుంచి అరుదైన పూలను తెప్పిస్తున్నారు. బార్హ్ మైదానంలో దేశవ్యాప్త గుర్రపు పందేలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన గుర్రం యజమానికి మహీంద్రా థార్ కారును, రెండో స్థానంలో నిలిచిన వారికి మోటార్ సైకిల్‌ను బహుమతిగా ఇవ్వనున్నారు. ముంబై, భోజ్‌పురి కళాకారులతో ప్రత్యేక వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బాణసంచా కాల్చడంపై నిషేధం విధించారు.


ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ప్రధాని నరేంద్ర మోడి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, సినీ నటుడు సోనూ సూద్, తదితరులను ఆహ్వానించారు. పెళ్లిళ్లకు రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్న అనంత్ సింగ్, భారత్‌తో పాటు పాకిస్థాన్‌లోని తన పరిచయస్తులకు కూడా వివాహ ఆహ్వాన పత్రికలు పంపుతున్నట్లు తెలిపారు. ప్రజలే తమకు దేవుళ్లని ఆయన వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉండగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంతో ఇటీవల అనంత్ సింగ్‌ను జేడీయూ బహిష్కరించింది. మరోవైపు దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 1న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లొంగిపోవడానికి వారం రోజుల ముందే కుమార్తె వివాహాన్ని ఇంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఆయన సిద్ధమవడం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్