సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వరుస తీర్పులు - 4 నెలల్లో 22మందికి మరణ శిక్ష..!

1 గంట క్రితం

A String of Verdicts – Death Sentences for 22 People in 4 Months!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 02:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముజఫ్ఫర్‌నగర్‌ (ఉత్తరప్రదేశ్) : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌లో అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ ఇటీవల కాలంలో వెలువరించిన తీర్పులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత నాలుగు నెలల వ్యవధిలోనే ఆయన 10 కేసుల్లో మొత్తం 22 మంది నిందితులకు మరణ శిక్ష విధించడం సంచలనం సృష్టిస్తోంది. 2022లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో వీడియో గ్రాఫిక్ సర్వేకు ఆదేశించిన న్యాయమూర్తిగా ఆయన జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. బరేలీలో పనిచేసిన సమయంలో 13 మందికి మరణశిక్ష విధించిన ఆయన, ముజఫ్ఫర్‌నగర్‌లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంఖ్యను 35కి చేర్చారు.


ఏప్రిల్ 6న న్యాయవాది సమీర్ సైఫీ హత్య కేసులో ముగ్గురు నిందితులకు, ఏప్రిల్ 28న ఒక కుటుంబానికి చెందిన నలుగురికి, ఇలా మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా పలు హత్యలు, దోపిడీ కేసుల్లో నిందితులకు ఆయన మరణ శిక్షను ఖరారు చేశారు. న్యాయవ్యవస్థలో ‘అరుదైన వాటిలో అత్యంత అరుదైనది’ అనే సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకుని మరణశిక్షలు విధించాలనే వాదనను పలువురు న్యాయవాదులు తెరపైకి తెస్తున్నారు. మరోవైపు ఈ తీర్పులు బాధితుల కుటుంబాలకు న్యాయం చేకూర్చడమే కాకుండా, న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచాయని హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.


అయితే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)సెక్షన్ 407(1) ప్రకారం, సెషన్స్ కోర్టు విధించే ప్రతి మరణశిక్షను హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంటుంది. హైకోర్టు ఆమోదం పొందే వరకు ఈ తీర్పులు అమల్లోకి రావు. న్యాయమూర్తి దివాకర్ గతంలో అజామ్‌గఢ్, సుల్తాన్‌పూర్, బదాయూన్ వంటి ప్రాంతాల్లో పనిచేశారు. 2024లో బరేలీలో ఒక కేసు విచారణ సందర్భంగా యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను ‘తత్వవేత్త రాజు’గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలను అలహాబాద్ హైకోర్టు తప్పుబడుతూ తొలగించింది. ఏది ఏమైనప్పటికీ, వరుసగా ఆయన విధిస్తున్న మరణశిక్షలు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్