అంతర్జాతీయ తమిళ చరిత్ర పరిశోధన సదస్సులో పాల్గొనేందుకు రామకృష్ణన్‌కు అనుమతి నిరాకరణ
ఖండించిన సిపిఎం
చెన్నై : మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో డిసెంబర్ 19, 20 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ తమిళ చరిత్ర పరిశోధన సదస్సులో పాల్గొనేందుకు ప్రముఖ పురావస్తు పరిశోధకుడు అమర్‌నాథ్ రామకృష్ణన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ చర్యను సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాజకీయ కక్షసాధింపు
కీళడి తవ్వకాల నివేదికలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాగా, అందుకు అమర్‌నాథ్ రామకృష్ణన్ నిరాకరించారు. ఆ కారణంగానే ఆయన విదేశీ పర్యటనలకు అనుమతులు నిరాకరించారని సిపిఎం విమర్శించింది. గత జూలై నెలలో అమెరికాలో జరిగిన ఒక సదస్సుకు వెళ్లేందుకు ఆయన అనుమతి కోరినప్పుడు కూడా కేంద్రం నిరాకరించిందని గుర్తు చేసింది. పురావస్తు శాఖలో అత్యుత్తమ పరిశోధకుడిగా గుర్తింపు పొందిన అమర్‌నాథ్ రామకృష్ణన్‌పై ఇలాంటి ఆంక్షలు విధించడం, ఆయన శాస్త్రీయ భావజాలానికి వ్యతిరేకంగా జరుగుతున్న కక్షసాధింపు చర్య అని పి. షణ్ముగం పేర్కొన్నారు. కీళడి ప్రాచీనత నిరూపితమైతే, సంఘ్ పరివార్ ప్రచారం చేస్తున్న నకిలీ చరిత్ర కథనాలకు విరుద్ధంగా ఉంటుందనే భయంతోనే నివేదికను మార్చి రాయాలని ఆయనపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ)ను కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ, సిద్ధాంత అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటోందని, అమర్‌నాథ్‌పై విధిస్తున్న ఆంక్షలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అమర్‌నాథ్ రామకృష్ణన్ మలేషియాలో జరిగే తమిళ చరిత్ర పరిశోధన సదస్సులో పాల్గొనకుండా విధించిన నిషేధం ఆమోదయోగ్యం కాదని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిషేధాన్ని ఎత్తివేసి ఆయనకు అనుమతి ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది.







కామెంట్‌లు (0)