- సమ్మెలో 8లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు
- దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, సభలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడాలని, ఐదు రోజుల పనివారాన్ని తక్షణమే అమలు చేయడంతోపాటు పెండింగ్‌లో ఉన్న వేతన, పెన్షన్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు శుక్రవారం సమ్మె చేపట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్‌బిలు) కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు పూర్తిగా మూతపడగా, మరికొన్నిచోట్ల పాక్షికంగా పనిచేశాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులపైనా సమ్మె ప్రభావం పడింది. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎఐబిఒఎ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ (ఎఐబిఒఎఫ్) తదితర ఏడు బ్యాంకు ఉద్యోగ, అధికారుల సంఘాలతో కూడిన యుఎఫ్‌బియు ఆధ్వర్యాన సమ్మె విజయవంతంగా జరిగింది. పబ్లిక్ రంగ బ్యాంకుల్లో పని చేసే సుమారు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో భాగస్వాములయ్యారు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, సభలు నిర్వహించారు. ఉద్యోగులు, అధికారులు బ్యాంకుల ఎదుట, ప్రధాన కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఉద్యోగులు మానవహారాలు, ర్యాలీలు, వంటావార్పులు చేపట్టారు. “ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయాలి”, “ఈక్వల్ పిఎల్ఐ వి డిమాండ్” అంటూ నినాదాలు చేశారు. భోపాల్, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, రాజ్‌కోట్, కలకత్తా, సిలిగురి, ఢిల్లీ, బెంగళూరు, మైసూర్, ముంబయి తదితర ప్రధాన నగరాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం వల్లే సమ్మె
తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వెంకటాచలం తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు, అధికారులు తమ పట్ల వివక్ష చూపుతున్నారనే భావనతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోని ట్రెజరీ ఆపరేషన్స్ నిలిపివేసినట్లు చెప్పారు. ప్రతి శనివారాన్ని హాలీడేగా ప్రకటించాలని కోరుతూ 2023 డిసెంబర్‌లో అధికారులకు అభ్యర్థన సమర్పించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్ జనరల్ సెక్రటరీ రూపమ్ రాయ్ తెలిపారు. 2024 మార్చిలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ)తో కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో అన్ని శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించాలన్న అంశంపై అంగీకారం కుదిరినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక నోటిఫికేషన్ రావాల్సి ఉందని యూనియన్లు చెబుతున్నాయి. ప్రస్తుతం నెలలో మొదటి, మూడో, ఐదో శనివారాల్లో బ్యాంకులు పనిచేయడం లేదు. పెన్షన్ నవీకరణ, పెన్షనర్లందరికీ ఒకే విధమైన డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) విధానం, జాతీయ పెన్షన్ పథకం (ఎన్‌పిఎస్) పరిధిలో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (ఒపిఎస్)లోకి మారే అవకాశం కల్పించడం వంటి ఇతర పెండింగ్ డిమాండ్లను కూడా పరిష్కరించాలని యూనియన్లు కోరుతున్నాయి. పనితీరు ఆధారిత ప్రోత్సాహక విధానం (పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ - పిఎల్‌ఐ) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు, అధికారులు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, అధికారుల సమస్యలను పరిష్కరించడంతోపాటు వారి హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్పందించకపోతే ఈ నెల 28, 29, 30 తేదీల్లో సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు యూనియన్లు స్పష్టం చేశాయి. ఆ తేదీలు బ్యాంకుల అర్ధవార్షిక ముగింపు కాలానికి దగ్గరగా ఉండటంతో, సమ్మె జరిగితే బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అప్పటికీ స్పందించకపోతే అక్టోబరు 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరిం చాయి. ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు యూనియన్లతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.








కామెంట్‌లు (0)