బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధం కావాలి

2 గంటల క్రితం

aiks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 12:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అఖిల భారత కిసాన్‌ సభ పిలుపు

23న ఢిల్లీలో రైతు మార్చ్‌కు మద్దతు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో:

భారత్‌ - అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని అఖిల భారత కిసాన్‌ ‌సభ (ఎఐకెఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం కుదుర్చుకుంటే దేశంలోని లక్షలాది మంది రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని హెచ్చరించింది. రైతు వ్యతిరేక ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయిస్తే దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఎఐకెఎస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు జరుగుతున్న చర్చలు ఈ ఆందోళనలకు కారణమని కిసాన్‌ సభ పేర్కొంది. ఒప్పంద వివరాలను పార్లమెంటుకు వెల్లడించకుండానే చర్చలు కొనసాగించడం ప్రజాస్వామ్య పారదర్శకతకు విరుద్ధమని విమర్శించింది. అమెరికా పాల ఉత్పత్తులను భారత మార్కెట్లోకి అనుమతించే అంశం ఒప్పందానికి ప్రధాన అడ్డంకిగా ఉందని రూబియో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. ఒప్పందానికి సంబంధించిన చట్టపరమైన ముసాయిదా రూపకల్పన తుది దశలో ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా ప్రకటించారని తెలిపింది.

సోయా, పామాయిల్‌ రైతులకు నష్టం

ఖరీఫ్‌ సీజన్‌లో సోయాబీన్‌ పంట కోతలు ప్రారంభమైన సమయంలోనే ముడి సోయాబీన్‌ నూనె, పామాయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని కిసాన్‌ సభ తప్పుబట్టింది. శుద్ధి చేసిన నూనెలపైనా సుంకాలను తగ్గించిందని, ఈ చర్యలు దేశీయ రైతులకు నష్టం కలిగిస్తాయని పేర్కొంది. అమెరికాలో పారిశ్రామిక స్థాయిలో వ్యవసాయం చేసే ఉత్పత్తిదారులకు భారీగా సబ్సిడీలు లభిస్తున్నాయని, వారితో భారతీయ సోయాబీన్‌ రైతులు పోటీపడటం కష్టమని తెలిపింది. దిగుమతులపై మరిన్ని సడలింపులు కల్పిస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని సోయాబీన్‌ రైతులు తీవ్రంగా ప్రభావితమవుతారని హెచ్చరించింది.

పాల రైతుల ఆదాయానికి గండి

అమెరికా పాల ఉత్పత్తులకు భారత మార్కెట్‌ను నియంత్రణలు లేకుండా తెరిస్తే దేశీయ పాడి రైతుల రోజువారీ ఆదాయం దెబ్బతింటుందని ఎఐకెస్‌ పేర్కొంది. భారీ సబ్సిడీలు పొందుతున్న విదేశీ ఉత్పత్తిదారులు తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయించగలరని, దీనివల్ల దేశీయ పాల సేకరణ ధరలు తగ్గే ప్రమాదం ఉందని తెలిపింది. దీని ప్రభావం పాల ఉత్పత్తిపై ఆధారపడిన గ్రామీణ కుటుంబాల జీవనోపాధిపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మొక్కజొన్న, జొన్న వంటి పశువుల దాణా పంటలు పండించే రైతులు, పత్తి రైతులతోపాటు బాదం, వాల్‌నట్‌, యాపిల్‌ సాగుదారులూ నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. అమెరికాకు వ్యవసాయ రంగంలో అధిక రాయితీలు కల్పించడం వల్ల భారత వ్యవసాయ మార్కెట్‌లో కార్పొరేట్‌ సంస్థల ఆధిపత్యం పెరుగుతుందని విమర్శించింది.

పోరాటానికి సమాయత్తం కావాలి

దేశ వ్యవసాయ రంగాన్ని ప‌రిర‌క్షించి రైతుల ఆదాయానికి భరోసా కల్పించాల్సిన సమయంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తోందని ఎఐకెస్‌ విమర్శించింది. దేశీయ రైతుల ప్రయోజనాలను పరిరక్షించే విధానాలు అమలు చేయాలని డిమాండ్‌ చేసింది. అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా, రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకుంటే రైతాంగం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించింది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దీర్ఘకాలిక పోరాటానికి అన్ని స్థాయుల్లోని రైతు సంఘాలు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలను నిరసిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఈ నెల 23న ఢిల్లీలో నిర్వహించనున్న మార్చ్‌లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎఐకెఎస్‌ కోరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్