శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బెంగాల్ ప్రతిపక్ష నేత నియామకం చెల్లదు

2 గంటల క్రితం

బెంగాల్ ప్రతిపక్ష నేత నియామకం చెల్లదు
-  రితబ్రత బెనర్జీ నియామకం రద్దు చేసిన కలకత్తా హైకోర్టు
-  10 రోజుల్లో తాజా నిర్ణయానికి ఆదేశం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 09:05 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​- రితబ్రత బెనర్జీ నియామకం రద్దు చేసిన కలకత్తా హైకోర్టు

- 10 రోజుల్లో తాజా నిర్ణయానికి ఆదేశం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత (ఎల్‌ఒపి)గా రితబ్రత బెనర్జీ నియామకాన్ని కలకత్తా హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ విప్‌గా అఖ్రుజ్జమాన్ నియామకాన్నీ కొట్టేసింది. స్పీకర్ నిర్ణయాలు చట్ట ప్రకారం నిలబడవని జస్టిస్ కృష్ణ రావు స్పష్టం చేశారు. రెండు నియామకాలపై ‘‘చట్ట ప్రకారం’’ 10 రోజుల్లో పునఃపరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ రథీంద్ర బోస్‌ను ఆదేశించారు. టిఎంసి నేత శోభన్‌దేవ్ చటోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువడింది. తన పేరును తిరస్కరించి, టిఎంసి రెబల్ వర్గం ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా నియమించడాన్ని ఆయన సవాల్ చేశారు. అఖ్రుజ్జమాన్ నియామకాన్నీ ప్రశ్నించారు.

​ స్పీకర్ నిర్ణయం అక్రమం : కల్యాణ్ బెనర్జీ

టిఎంసి ఎంపి కల్యాణ్ బెనర్జీ తీర్పుపై స్పందిస్తూ, స్పీకర్ నిర్ణయం చట్టవిరుద్ధమని కోర్టు గుర్తించిందన్నారు. స్పీకర్ రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలని, బెంగాల్‌లో అలా జరగలేదని విమర్శించారు. అక్టోబర్ 18 వరకు డివిజన్ బెంచ్ రితబ్రతను తాత్కాలిక ప్రతిపక్ష నేతగా కొనసాగించిందని, ఇప్పుడు అదీ లేకుండా పోయిందన్నారు. ఆ తర్వాత కూడా ప్రతిపక్ష నేతగా వేతనాలు, సౌకర్యాలు పొందడం అన్యాయమన్నారు.

​ఇది అసాధారణమేమీ కాదు : రితబ్రత

రితబ్రత బెనర్జీ మాట్లాడుతూ, కోర్టు వ్యవహారాన్ని కొత్త నిర్ణయం కోసం స్పీకర్‌కు తిరిగి పంపడం అసాధారణమేమీ కాదన్నారు. స్పీకర్ పిలిస్తే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో హాజరవుతామని చెప్పారు. సస్పెండ్‌ అయిన ఎంపి కల్యాణ్‌ బెనర్జీ డీలిమిటేషన్‌ బిల్లుపై ఓటు వేయలేరని, ఆయన వ్యాఖ్యల్లో నిరాశ కనిపిస్తోందని విమర్శించారు. అయితే, టిఎంసి తరఫు న్యాయవాది అర్కో నాగ్ మాట్లాడుతూ, జూన్ 3న స్పీకర్ చేసిన తాత్కాలిక నియామకాన్ని కోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించిందన్నారు. నేటి నుంచి 10 రోజుల్లో, అంటే వచ్చేనెల 7లోగా, వాదనలు విని కారణాలతో కూడిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కోరిందని తెలిపారు. ప్రస్తుతం బెంగాల్‌లో ప్రతిపక్ష నేత ఎవరూ లేరని పేర్కొన్నారు. రితబ్రత ప్రతిపక్ష నేతగా పొందిన ప్రయోజనాలన్నీ చట్టవిరుద్ధమని, వాటిని తిరిగి చెల్లించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్