- ప్రింటర్, పబ్లిషర్ పేరు లేకుండా కరపత్రాలు ప్రచురించడంపై ఇసికి సిపిఎం ఫిర్యాదు
అగర్తలా : త్రిపుర పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి పంపిణీ చేస్తున్న కరపత్రాల్లో ప్రింటర్, పబ్లిషర్ వివరాలు లేవని, ఆ కరపత్రాలపై నిషేధం విధించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బిజెపిపై వెంటనే చర్యలు తీసుకోవలాని సిపిఎం త్రిపుర రాష్ట్ర కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రాసిన లేఖలో, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం ద్వారా బిజెపి నాయకులు పంపిణీ చేస్తున్న కరపత్రంలో ముఖ్యమంత్రి మాణిక్ సాహా, బిజెపి రాష్ట అధ్యక్షుడు అభిషేక్ దేబ్రాయ్, బిజెపి ఎంపీ, ప్రధాన కార్యదర్శి బిప్లబ్ కుమార్ దేబ్‌ల ఫొటోలు, విజ్ఞప్తులు ఉన్నాయని, ప్రింటర్, పబ్లిషర్ పేర్లు, చిరునామాలు లేవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి పేర్కొన్నారు. ఫ్లెక్సీ పోస్టర్లు, హోర్డింగ్‌లు, బ్యానర్లపై కూడా తప్పనిసరి అయిన ప్రింటర్, పబ్లిషర్ డిక్లరేషన్లు లేవని విమర్శించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష, లేదా రూ. 2,000 వరకు జరిమానా, లేదా రెండూ విధించాల్సి ఉందని ఆయన కమిషన్‌కు గుర్తు చేశారు.ఆ కరపత్రం పంపిణీని నిషేధిస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని, దాని తదుపరి పంపిణీని నిరోధించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించాలని, దానిని ముద్రించి, ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు. ఫిర్యాదుతో పాటు కరపత్రం యొక్క కాపీని జత చేశారు.








కామెంట్‌లు (0)