ముంబయి : రుణాల స్కామ్ కేసులో మాజీ సిఇఒ చందాకొచ్చర్ విచారణ కోసం ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చిన అనుమతిని బాంబే హైకోర్టు బుధవారం కొట్టివేసింది. అనుమతిని మంజూరు చేసిన బ్యాంక్ అధికారి తన విచక్షణను వినియోగించడంలో విఫలమయ్యారని జస్టిస్ మిలిండ్ జాధవ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. 2023 మే 15న ఇచ్చిన అనుమతి చట్టవిరుద్ధమని, దానిని రద్దు చేయాలని ధర్మాసనం పేర్కొంది. ఈ అనుమతిని మంజూరు చేసిన అధికారికి తగిన అధికార పరిధి లేదని, అనుమతి ఇచ్చే సమయంలో ఆయన ముందు ఉంచిన సాక్ష్యాధారాలను పరిశీలించడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపింది. ఈ అనుమతి ఉత్తర్వు చట్టపరంగా నిలవదని, దీంతో ఇది చెల్లనిదిగా పరిగణించబడుతుందని పేర్కొంది. తనను విచారించేందుకు అనుమతి మంజూరు చేసే సమయంలో ఐసిఐసిఐ బ్యాంక్ సరైన విధానాన్ని అనుసరించలేదని చందా కొచ్చర్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐసిఐసిఐ బ్యాంక్ 2012లో వీడియోకాన్ గ్రూపునకు మంజూరు చేసిన రూ.3,250 కోట్ల రుణానికి సంబంధించి ఈ కేసు నమోదైంది. ఆ సమయంలో చందా కొచ్చర్ బ్యాంక్ సిఇఒగా ఉన్నారు. ఈ రుణాన్ని మంజూరు చేయడంలో మోసం, అక్రమాలు జరిగాయని సిబిఐ పేర్కొంది. రుణాల మోసం కేసులో 2022 డిసెంబర్‌లో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సిబిఐ అరెస్ట్ చేసింది. 2023లో వారు బెయిల్‌పై విడుదలయ్యారు.







కామెంట్‌లు (0)