- 10న జంతర్ మంతర్ వద్ద నిరసన
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. ముంబైలోని శివాజీ పార్కులో జరిగిన నిరసన అనంతరం ‘చలో ఢిల్లీ’ పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను కోరుకునే ప్రతి ఒక్కరూ నిరసనలో పాల్గొనాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా యువత జంతర్ మంతర్‌కు తరలివస్తారని దీప్కే పేర్కొన్నారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తే, పోలీసులు ఎక్కడ నిలువరించినా ఆ ప్రాంతమే జంతర్ మంతర్‌గా మారుతుందని ఆయన అన్నారు. తమది శాంతియుత నిరసన అని, శాంతియుతంగా ఆందోళన చేసే హక్కును ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు గౌరవించాలని దీప్కే కోరారు. జూలై 20న చోటుచేసుకున్న ఘటనలను పునరావృతం చేయకూడదని పేర్కొంటూ, ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు చేపడుతున్న పోరాటమని ఆయన అన్నారు.
కొన్ని రోజుల క్రితం ముంబైలోని శివాజీ పార్కులో సీజేపీ నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన జరిగింది. ఢిల్లీలోనూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జ్ఞానేష్ కుమార్ రాజీనామా, 2025 ఓటర్ల జాబితాలను స్తంభింపజేయడం, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని రద్దు చేయడం వంటి డిమాండ్లను నిరసనకారులు ముందుకు తెస్తున్నారు.
శివాజీ పార్కులో నిర్వహించిన నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ వేలాది మంది యువత పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలతో పాటు నటులు నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, చిత్రనిర్మాతలు విశాల్ భరద్వాజ్, హన్సల్ మెహతా, గాయకుడు విశాల్ దద్లానీ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)