- జంతర్ మంతర్‌కు భారీ ర్యాలీ
- బలవంతంగా అరెస్టు చేసి తరలించిన ఢిల్లీ పోలీసులు
- సిఇసి జ్ఙానేష్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు ఉధృతమయ్యాయి. ఆదివారం వేలాది మంది ఇండియా గేట్ నుంచి జంతర్‌మంతర్ వైపు సిటిజన్ మార్చ్ నిర్వహించారు. ఆందోళనలను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్), సిఆర్‌పిఎఫ్ బలగాలు భారీగా మోహరించి, నిరసనకారులపై తీవ్ర నిర్బంధ చర్యలకు పాల్పడ్డాయి. జంతర్‌మంతర్, ఆంధ్రప్రదేశ్ భవన్, అశోక్ రోడ్ పరిసరాల నుంచి వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అణచివేతకు నిరసనకారులు వెనక్కి తగ్గకుండా ఆందోళనలను కొనసాగించారు. ఉద్యమకారులతోపాటు అక్కడే ఉన్న కొందరు జర్నలిస్టులపై కూడా పోలీసులు దాడి చేసినట్లు నేతలు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఆందోళనల్ని అణిచేందుకు దాదాపు 5వేల మందికిపైగా పోలీసులను మోహరించారు.
ఆంధ్రా భవన్ నుండి ప్రారభమైన ర్యాలీ..
జ్ఞానేష్ కుమార్ రాజీనామాతోపాటు నిరసనల సందర్భంగా మహిళా జర్నలిస్టులపై లైంగికదాడి చేసిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి ప్రారంభమైన సిటిజన్స్ మార్చ్‌లో వందలాది మంది పాల్గొన్నారు. సామాజిక కార్యకర్తలు, ఎఐఎస్‌ఎఫ్, ఎఐఎస్ఎ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ మార్చ్ సాగింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నిరసనకారులు దాటుకుని ముందుకు సాగారు. మార్చ్‌కు నాయకత్వం వహించిన యోగేంద్ర యాదవ్, ఎఐఎస్ఎ అఖిల భారత అధ్యక్షురాలు నేహా బోరాలను పోలీసులు అరెస్టు చేశారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సహా కీలక నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. మహిళా నిరసనకారులను పురుష పోలీసులు ఈడ్చుకెళ్లడంతో నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా సిపిఎం సీనియర్ నాయకురాలు బృందా కరత్ అడ్డుకున్నారు.
అక్రమంగా అరెస్టులు.
ఢిల్లీలోని పలు ప్రాంతాల నుంచి వివిధ సంఘాల ఆధ్వర్యంలో, స్వతంత్రంగా నిరసనకారులు జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. దీంతో పోలీసులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అరెస్టు చేసిన నిరసనకారులను తరలిస్తున్న పోలీసు వాహనాలను పలుచోట్ల ఆందోళనకారులు అడ్డుకున్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది. అరెస్టుల కోసం బస్సులు, కార్లు సహా ప్రైవేటు వాహనాలను కూడా పోలీసులు వినియోగించారు. నేహా బోరాను పురుష పోలీసులు మాత్రమే ఉన్న ప్రైవేటు కారులో పోలీస్ స్టేషన్‌కు తరలించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. దీంతో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కార్యకర్తలు సహా పలువురు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. విమర్శలు వెల్లువెత్తడంతో నరేలా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు తరలించిన నేహా బోరాను అనంతరం విడుదల చేశారు.
నిరసనల సందర్భంగా మహిళా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ కూడా ఆందోళనలో భాగమైంది. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజి, ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, జాయింట్ సెక్రటరీ ఐషీ ఘోష్ తదితరులు పార్లమెంట్ పోలీస్ స్టేషన్ ఎదుటకు చేరుకుని నిరసన తెలిపారు. జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం ఎఎస్ఎపి, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కూడా ఆందోళనలకు దిగారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలకు నిరసనగా, సిఈసి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలో నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి.







కామెంట్‌లు (0)