న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో డిసెంబర్ 1న తలపెట్టిన 'పార్లమెంట్ మార్చ్'కు దేశవ్యాప్తంగా లక్షకు పైగా కార్మికులు తరలిరానున్నారు. వివిధ రంగాలకు చెందిన ఈ ఆందోళనకారులలో 50 వేల మంది మహిళా కార్మికులు మార్చ్‌కు ముందుండి నాయకత్వం వహించనున్నారు. కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని, కనీస వేతనాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ మార్చ్‌కు కొనసాగింపుగా న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో మూడు రోజుల పాటు రాత్రింబవళ్ల నిరసన దీక్ష కూడా చేపట్టనున్నారు.
ఈ ఉద్యమ నేపథ్యాన్ని, ప్రధాన డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్చ్ ఏర్పాట్ల వివరాలను సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం, అధ్యక్షుడు సుదీప్ దత్తా, జాతీయ కార్యదర్శి ఏ.ఆర్. సింధు మీడియాకు వివరించనున్నారు.
ప్రముఖ ఆర్థికవేత్తల సంఘీభావం:
కార్మిక వర్గ పోరాటానికి మద్దతుగా దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, మేధావులు రూపొందించిన ఉమ్మడి సంఘీభావ ప్రకటనను కూడా రేపటి మీడియా సమావేశంలో విడుదల చేయనున్నారు. జేఎన్‌యూ ప్రొఫెసర్ ఎమెరిటస్ మరియు వర్కర్స్ మార్చ్ ఆహ్వాన సంఘం ఛైర్మన్ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్, మసాచుసెట్స్ విశ్వవిద్యాలయ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ కార్మిక చరిత్రకారుడు మరియు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ లేబర్ హిస్టోరియన్స్ కార్యదర్శి ప్రొఫెసర్ ప్రభు మొహపాత్ర ఈ సంయుక్త ప్రకటనను విడుదల చేస్తారు.
దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభాలు, పెరుగుతున్న నిరుద్యోగం నేపథ్యంలో ఈ కార్మిక ఉద్యమానికి ఉన్న రాజకీయ, సామాజిక ప్రాధాన్యతను ఈ సందర్భంగా ప్రముఖులు వివరించనున్నారు.







కామెంట్‌లు (0)