బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యువతతో పాటు దేశ భవిష్యత్తుపైనా ‘ఓట్ల చోరీ’ ప్రభావం : సిజెపి

15 గంటల క్రితం

Saurav Das
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 12:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఓట్ల చోరీ, ఎన్నికల అక్రమాలు, ఓటర్ల జాబితాలో యువత పేర్ల నమోదులో జరుగుతున్న లోపాలు యువతతో పాటు దేశ భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ అన్నారు. ఈ అంశాలపై దేశవ్యాప్తంగా యువత ఆందోళనకు సిద్ధమవుతోందని, అక్టోబర్‌ 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పార్లమెంట్‌ స్ట్రీట్‌లో బుధవారం సౌరవ్‌దాస్‌ మీడియాతో మాట్లాడారు. అక్టోబర్‌ 10న సిజెపి, దేశవ్యాప్తంగా యువత కలిసి జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టనున్న విషయాన్ని తెలియజేస్తూ పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌లో అధికారిక లేఖ సమర్పించినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నిరసనకు సహకారం, అవసరమైన ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేయాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. ఢిల్లీ పోలీసులు అధికారిక నోటిఫికేషన్‌ను స్వీకరించారని, తాము అవసరమైన హామీపత్రాన్ని సమర్పించడంతోపాటు అన్ని అధికారిక ప్రక్రియలను పూర్తి చేశామని తెలిపారు. పోలీసులు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓట్ల చోరీ, ఎన్నికల హైజాకింగ్‌ వంటి అంశాలపై ప్రధానంగా యువత గళమెత్తనుందని దాస్‌ తెలిపారు. ఓటర్ల జాబితాలో జెన్‌-జెడ్‌ తరానికి చెందిన యువతను చేర్చడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోందని విమర్శించారు. ఓట్ల చోరీ, ఎన్నికల అక్రమాలు, యువత పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయడంలో ఎదురవుతున్న సమస్యలు తమ భవిష్యత్తుతోపాటు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనతోనే యువత నిరసనకు సిద్ధమవుతోందని అన్నారు. ఇది కేవలం సిజెపికి సంబంధించిన అంశం కాదని, ప్రజలకు సంబంధించిన అంశమని దాస్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌ 10న జరగనున్న నిరసనలో జెన్‌-జెడ్‌ సహా దేశవ్యాప్తంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘చలో ఢిల్లీ’ తమ నినాదమని, యువత తమ హక్కుల కోసం గళమెత్తాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్