న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ (ఎస్సీపీ) కింద నాలుగు మెడికల్ కళాశాలల్లో దళిత్, ఆదివాసీ విద్యార్థులకు ప్రస్తుతం అమలవుతున్న 70 శాతం రిజర్వేషన్లను తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
'ఎస్సీపీ బచావో అభియాన్' అనే సంస్థతో కలిసి అలహాబాద్ హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులపై ఎస్ఎఫ్ఐ చట్టపోరాటానికి దిగింది. దళిత, ఆదివాసీ విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అంబేడ్కర్ నగర్, కనౌజ్, జలౌన్, సహారన్‌పూర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలల్లో ఈ రిజర్వేషన్లను పరిరక్షించడమే తమ ప్రధాన ధ్యేయమని ఎస్ఎఫ్ఐ తెలిపింది.
హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు దళిత, ఆదివాసీ విద్యార్థుల విద్యా హక్కులను కాలరాసేలా ఉన్నాయని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తాము చివరి వరకు పోరాడతామని ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సజి, ప్రధాన కార్యదర్శి సృజన్ భట్టాచార్య స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)