57 మెట్రో స్టేషన్ల మూసివేత
న్యూఢిల్లీ : ఓట్ల చోరీపై అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టనున్న నిరసనలను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు యత్నిస్తున్నారు. ఢిల్లీలోని సుమారు 57 మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేయడంతోపాటు, ఆయా స్టేషన్లలో రైళ్ల రాకపోకలను తగ్గించాలని ఢిల్లీ పోలీసులు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)కి ప్రతిపాదించినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. ఈ మేరకు గురువారం రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీఎంఆర్‌సీకి లేఖ రాశారు. జంతర్‌మంతర్‌తోపాటు న్యూఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో నిరసనలు జరగనున్న నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో జనసమూహాలు కదిలే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుర్తించిన మెట్రో స్టేషన్లలో అవసరమైన ఆంక్షలు విధించాలని కోరారు. ఈ ప్రతిపాదిత ఆంక్షలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమై, శనివారం రాత్రి వరకు కొనసాగనున్నాయి. మూసివేయనున్న 57 మెట్రో స్టేషన్లలో రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, జనపథ్, న్యూఢిల్లీ, మండి హౌస్, ఐటీఓ, సుప్రీంకోర్టు, ఇంద్రప్రస్థ, కాశ్మీరీ గేట్, కరోల్‌బాగ్, ఐఎన్‌ఏ, హౌజ్‌ఖాస్, లజ్‌పత్‌నగర్, జామియా మిలియా ఇస్లామియా, సీలంపూర్, వెల్‌కమ్, షాహదారా, రిథాలా, రోహిణి ఈస్ట్, రోహిణి వెస్ట్ తదితర స్టేషన్లు ఉన్నాయి.
ఓట్ల చోరీకి వ్యతిరేకంగా అక్టోబర్ 10న యువత ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ప్రకటించింది. ఈ ఆందోళనకు ముందు దేశవ్యాప్తంగా పలువురు కార్యకర్తలను నిర్బంధించారని సిజెపి కార్యకర్త అభిజీత్ దీప్కే ఎక్స్‌లో పేర్కొన్నారు. పోలీసుల చర్యలు, బెదిరింపులకు తాము వెనుకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీకి చేరుకుని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జంతర్‌మంతర్ వరకు ర్యాలీ చేపడతామని స్పష్టం చేశారు.
మెట్రో స్టేషన్లపై ఆంక్షలు విధించడం, కార్యకర్తలను నిర్బంధించడంపై సిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతర్‌మంతర్‌కు చేరుకోకుండా యువతను అడ్డుకునేందుకే పోలీసులు ఇటువంటి చర్యలు చేపడుతున్నాయని మండిపడింది.







కామెంట్‌లు (0)