మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆస్తుల జప్తుపై హైకోర్టును ఆశ్రయించిన డిఎంకె ఎంపి కుటుంబం

2 గంటల క్రితం

DMK MP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 11:46 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

చెన్నై : ఫెమా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసిన రూ.45.34 కోట్ల విలువైన ఆస్తుల వ్యవహారంలో డిఎంకె ఎంపి ఎస్. జగత్రక్షకన్, ఆయన కుమారుడు జె. సందీప్ ఆనంద్, కుమార్తె జె. శ్రీ నిష సోమవారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మొత్తం రూ.161.12 కోట్ల మేర విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ ముగ్గురు దాఖలు చేసిన వ్యక్తిగత సివిల్ అప్పీళ్లను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన మొదటి డివిజన్ బెంచ్ ఈడీకి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. 2026 మే 21న , న్యూఢిల్లీలోని ఫెమా అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. రూ.89.17 కోట్ల విలువైన ఆస్తుల జప్తు ఉత్తర్వును గతంలో పూర్తిగా కొట్టివేసిన సమర్థ అధికారి నిర్ణయాన్ని ట్రిబ్యునల్ పాక్షికంగా తిరస్కరించి, రూ.45.34 కోట్ల ఆస్తుల జప్తును మాత్రమే సమర్థించింది.

2017లో సింగపూర్‌లో సిల్వర్ పార్క్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటుతో ఈ వ్యవహారం ప్రారంభమైంది. కంపెనీలో జగత్రక్షకన్ 70 లక్షల షేర్లు, ఆయన కుమారుడు ఆనంద్ 20 లక్షల షేర్లు, వి.టి. త్యాగరాజన్ మరో 10 లక్షల షేర్లు కలిగి ఉన్నారు. ఒక్కో షేరు నామమాత్రపు విలువ ఒక సింగపూర్ డాలర్‌గా నిర్ణయించారు. 2017 జూన్ 15 నుంచి 2018 సెప్టెంబర్ 15 వరకు తాను కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నట్లు ఎంపి తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించడంతో ఈడీ విచారణ ప్రారంభించింది. కంపెనీకి సంబంధించి ఆర్‌బిఐ వద్ద ఎలాంటి సమాచారం లేదని ప్రాథమిక విచారణలో తేలినట్లు ఈడీ పేర్కొంది. విచారణలో భాగంగా జగత్రక్షకన్ 2018 సెప్టెంబర్ 15న తన భార్య అనూసూయకు 45 లక్షల షేర్లు, కుమార్తెకు 22.50 లక్షల షేర్లు, కుమారుడికి 2.5 లక్షల షేర్లు బహుమతిగా ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. అనంతరం 2019 మే 2న అనూసూయ తన షేర్లను కుమారుడు, కుమార్తెకు సమానంగా బదిలీ చేశారు. షేర్ల సబ్‌స్క్రిప్షన్, బదిలీ, బహుమతుల విషయంలో ఆర్‌బిఐ అనుమతి అవసరం లేదని భావించామని కుటుంబ సభ్యులు ఈడీకి తెలిపారు. అయితే, ఈ వాదనను తిరస్కరించిన ఈడీ ఫెమా సెక్షన్ 4 ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించింది.

2020 సెప్టెంబర్ 11న రూ.89.17 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, 2021 ఫిబ్రవరి 3న ఫెమా సమర్థ అధికారి ఆ ఉత్తర్వులను పూర్తిగా కొట్టివేశారు. దీనిపై అప్పీల్ చేసిన ఈడీ వాదనలను పరిశీలించిన ట్రిబ్యునల్ సింగపూర్ కంపెనీ ఆర్థిక నివేదికలో రూ.కోట్ల విలువైన వాటా మూలధనం ఉన్నట్లు గుర్తించింది. షేర్లకు నామమాత్రపు విలువ ఉన్నప్పటికీ వాటి విలువ సున్నా కాదని పేర్కొంది. షేర్ల సబ్‌స్క్రిప్షన్, బదిలీ వేర్వేరు లావాదేవీలుగా పరిగణించాలన్న ఈడీ వాదనను ట్రిబ్యునల్ తిరస్కరించింది. అయితే, కుటుంబ సభ్యులు షేర్ల కోసం డబ్బు చెల్లించారనే నిర్ధారణకు రాకుండానే జప్తు ఉత్తర్వును పాక్షికంగా సమర్థించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ జగత్రక్షకన్ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్