- పోరాటాల వేదికగా కార్యాలయం : ఎంఎ బేబీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : యువజన, ప్రజా పోరాటాలకు మరింత బలాన్నిచ్చే లక్ష్యంతో దేశ రాజధాని ఢిల్లీలో డివైఎఫ్ఐ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. ‘భగత్‌సింగ్ భవన్’ పేరుతో దరియాగంజ్‌లో నిర్మించిన ఈ కార్యాలయాన్ని సిపిఎం ప్రధాన కార్యదర్శి, డివైఎఫ్ఐ మాజీ అఖిల భారత అధ్యక్షులు ఎంఎ బేబీ శనివారం ప్రారంభించారు. సమావేశ మందిరంతోపాటు సంస్థ కార్యకలాపాలకు అవసరమైన వివిధ సౌకర్యాలతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఎంఎ బేబీ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. అక్టోబరు 2న జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనపై ఢిల్లీ పోలీసులు దాడులకు పాల్పడినప్పటికీ ధైర్యంగా ప్రతిఘటించిన డివైఎఫ్ఐ, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. నిరసనకారులపై పోలీసుల దాడి ప్రజాస్వామిక హక్కులపై దాడి వంటిదని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన ఉద్యమంలో డివైఎఫ్ఐ కూడా కీలక పాత్ర పోషించిందని బేబీ గుర్తుచేశారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్‌కు సన్నిహితుడిగా పేర్కొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిన పోరాటం యువజన ఉద్యమాల శక్తిని చాటిందని అన్నారు. ఆ ఉద్యమానికి కొనసాగింపుగా ఇప్పుడు రెండో దశ పోరాటం ముందుకు సాగనుందని తెలిపారు. అలాగే, దేశంలో ఓటు హక్కును పరిరక్షించాలనే డిమాండ్‌తో చేపట్టిన పోరాటాన్ని డివైఎఫ్ఐ తన భుజస్కంధాలపై వేసుకుందన్నారు. యువతకు ఉపాధి కల్పన, గౌరవప్రదమైన వేతనాల కోసం డివైఎఫ్ఐ ఉద్యమానికి పిలుపునిచ్చిందని తెలిపారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణతోపాటు యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఆర్థిక సమస్యలపై పోరాటాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. యువజన పోరాటాలకు వేదికగా కార్యాలయం ఉండాలని అన్నారు. సంస్థ కార్యకలాపాల నిర్వహణకు కార్యాలయం అవసరమేనని, అయితే సంఘం నిరంతరం ప్రజల మధ్య, పోరాట క్షేత్రాల్లో ఉండాలని సూచించారు. కార్యాలయాలు కేవలం సమావేశాలకు, పరిపాలనా కార్యకలాపాలకే పరిమితం కాకూడదన్నారు. ఉద్యమాలపై నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు మాత్రమే కార్యాలయానికి రావాలని, మిగిలిన సమయమంతా ప్రజా సమస్యలపై పోరాటాల్లోనే గడపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవ సభలో డివైఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎఎ రహీం, హిమాగ్నరాజ్, డివైఎఫ్ఐ వ్యవస్థాపక మాజీ ప్రధాన కార్యదర్శి హనన్ మొల్లా, సిపిఎం సీనియర్ నాయకులు బృందా కరత్, డివైఎఫ్ఐ అఖిల భారత కోశాధికారి సంజీవ్ కుమార్, కేంద్ర కార్యవర్గ సభ్యులు జైక్ సి. థామస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్ ఎం. సాజి, శ్రీజన్ భట్టాచార్య, ఐద్వా ప్రధాన కార్యదర్శి కనీనికా ఘోష్, ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)