- తీవ్ర నియంతృత్వ, ఆధిపత్య ధోరణితో ఎలక్షన్ కమిషన్
- బిజెపి ఉద్యోగిలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పని చేస్తున్నారు
- అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నాం
- కేజ్రీవాల్‌తో భేటీ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో బిజెపి జేబు సంస్థగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వ్యవహరిస్తుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయాన్ని విస్తృతం చేసేందుకు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్‌తో ఎంఎ బేబీ భేటీ ఆదివారం అయ్యారు. ఈ సందర్భంగా బేబీ మాట్లాడుతూ కేరళం మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పినరయి విజయన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు లక్ష్యంగా చేసుకుని ఇడి దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. బిజెపి జీతగాడుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పని చేస్తున్నారని, ఈ తీవ్రమైన పరిస్థితిపై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నామని బేబీ తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు కేరళం రాష్ట్రం గురించి మాజీ ఆర్థిక మంత్రి టి.ఎం థామస్ ఐజాక్ రాసిన పుస్తకాన్ని అందజేశారు. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రతిపక్షాలపై ఇడి చర్యలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు సంబంధించిన వివాదం, ఎన్నికల సంఘం పనితీరు, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరాన్ని బేబీ ప్రస్తావించారు. ఈ అంశంపై ‘ఇండియా బ్లాక్’ పరిధిని దాటి ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకుని విస్తృత వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఇప్పటికే పలు పార్టీలకు లేఖలు రాసినట్లు కేజ్రీవాల్‌కు తెలిపారు.
అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహారంపైనా సమావేశంలో చర్చించారు. కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలను బేబీ ప్రస్తావించారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ గతంలో ఇడి చర్యలను ఎదుర్కొన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇడి చర్యలకు వ్యతిరేకంగా బలమైన ప్రతిఘటన అవసరాన్ని బేబీ నొక్కి చెప్పారు. అలాగే ఇడి చర్యలకు వ్యతిరేకంగా కేరళంలో జరిగే పోరాటాల్లో పాల్గొనాలని కేజ్రీవాల్‌ను కోరారు. అయితే, దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ అంతర్గతంగా చర్చించిన అనంతరం తన నిర్ణయాన్ని తెలియజేస్తుందని కేజ్రీవాల్ చెప్పినట్లు తెలిపారు. అలాగే, తాము ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించామన్నారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీరందరూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలకు బాధితులేనని, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి, దేశ సమాఖ్య గణతంత్రాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించానని బేబీ తెలిపారు.
రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలనేది సిపిఎం విధానం
ఎలక్షన్ కమిషన్ తీవ్ర నియంతృత్వ, ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందనే విషయాన్ని నొక్కి చెప్పినట్లు తెలిపారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వం ఈ సంస్థను ఒక సాధనంగా బిజెపి ఎలా ఉపయోగిస్తుందో బయటపెట్టడానికి బలమైన పోరాటం అవసరమన్నారు. ఇండియా బ్లాక్‌తో పాటు ఇతర పార్టీలతో కూడా సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయత, భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్న అసాధారణ పరిస్థితిని ఎంఎ బేబీ వివరించారు. రాజ్యాంగ విలువలను, పౌరుల ఓటు హక్కును పరిరక్షించడానికి సమన్వయ చర్యలు తక్షణమే తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. జ్ఞానేష్ కుమార్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో సివిల్ సర్వెంట్‌గా పనిచేస్తున్నప్పుడు, కేరళం చీఫ్ సెక్రటరీగా పని చేసే అధికారిని బిజెపిలో చేరి మంత్రి కావాలని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని అన్నారు. అప్పట్లో సివిల్ సర్వెంట్‌గా ఉన్నప్పుడు జ్ఞానేష్ కుమార్ ఎలా పనిచేశారో, ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనరైనా బిజెపి ఉద్యోగిలాగే పనిచేస్తున్నారని విమర్శించారు. ఆయన హోమ్ మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు కూడా బిజెపి ఉద్యోగిలాగే వ్యవహరించారని, ఇది దేశంలో ఏర్పడిన తీవ్రమైన పరిస్థితి అన్నారు. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలనేది సిపిఎం విధానమని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ముందుకు రావాలన్నారు. బిజెడి, విజయ్ పార్టీ, కమల్‌హాసన్ పార్టీ, సిజెపి అన్ని పార్టీలు కలిసి పని చేయాలని కోరారు. ఇప్పటికే సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ ప్రధాన కార్యదర్శులు కలిసి చర్చించారని, మిగిలిన వామపక్ష పార్టీలు ఆర్ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్‌తో సంప్రదింపులు చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి బలమైన పోరాటాన్ని నిర్మించేందుకు ముందుకు రావాలని ఐదు వామపక్ష పార్టీలు పిలుపు ఇచ్చాయని గుర్తు చేశారు. సెప్టెంబర్ 30న ఢిల్లీలో ‘ఇండియా’ బ్లాక్ పార్టీల సమావేశం జరగనుంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన పరిణామాలు, ఎస్ఐఆర్ తదితర అంశాలపై ఆ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.








కామెంట్‌లు (0)