న్యూఢిల్లీ : దేశంలో నవతరం (జెన్-జీ) ఓటర్లను నమోదు చేసే వార్షిక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిలిపివేసింది. చట్ట ప్రకారం ప్రతి ఏటా చేపట్టాల్సిన ‘స్పెషల్ సమ్మరీ రివిజన్’ (SSR) ప్రక్రియ దాదాపు మూడేళ్లుగా నిలిచిపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై జెన్-జీ యువతలో వ్యక్తమవుతున్న ఆగ్రహం, మతపరమైన రాజకీయాలపై పెరిగిన విముఖత అధికార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త తరం ఓటర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచే వ్యూహంలో భాగమే ఈ నిలిపివేత అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాప్రాతినిధ్య చట్టం (1950) సెక్షన్ 21 ప్రకారం ప్రతి ఏటా కొత్త ఓటర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించడం ఎన్నికల సంఘం బాధ్యత. అయితే, ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) జరుగుతోందనే సాకుతో ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR)ను అడ్డుకుంటున్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల తర్వాత కేంద్ర ప్రభుత్వ లోపాలు బహిర్గతం కావడంతో యువత రాజకీయంగా మరింత చైతన్యవంతమైంది. ఈ నేపథ్యంలోనే వారి ఓటు హక్కును అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సాధారణంగా ప్రతి ఏటా మే-జూన్ నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేసి నిర్వహించే SSR ప్రక్రియ 2024 నుంచి ఆగిపోయింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని చెప్తున్నప్పటికీ, సాంకేతిక అడ్డంకులు, ఫారమ్-6 ప్రక్రియలో సమస్యల వల్ల స్వయంగా ఓటు నమోదు చేసుకునేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.
ఈ విషయమై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పదేపదే హెచ్చరించినప్పటికీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) మౌనం వహించారని తెలుస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిల మధ్య ఈ విషయంలో అభిప్రాయ భేదాలు రావడంతోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఏళ్లు గడుస్తున్నా లభించని న్యాయసలహా : సంధూ, జోషిలు వెంటనే SSR ప్రక్రియను పునఃప్రారంభించాలని గట్టిగా డిమాండ్ చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ రాజకీయాలకు అతీతంగా ఓటర్ల జాబితాలో చేర్చడం ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమని వారు హెచ్చరించారు. SIR జరుగుతున్నంత మాత్రాన SSR నిలిపివేయడం సరికాదని స్పష్టం చేశారు.
అయితే, కొన్ని రాష్ట్రాల్లో 'SIR' జరుగుతున్నందున, మళ్లీ కొత్త ఓటర్ల నమోదు అవసరమా అనే ప్రశ్నను లేవనెత్తుతూ ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. దీనిపై న్యాయసలహా తీసుకుంటున్నామని చెప్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఎన్నికల వేళ ఓట్ల కోత వ్యూహం? :
2024లో చివరిసారిగా దేశవ్యాప్తంగా SSR జరిగింది. 2025లో బిహార్‌లో ప్రారంభమైన SIR ప్రక్రియను ఇతర రాష్ట్రాలకూ విస్తరించారు. రాబోయే కాలంలో ఉత్తర ప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, SSR ద్వారా కొత్త ఓట్లు రాకుండా చూడటం, SIR నెపంతో తమకు వ్యతిరేకంగా పడే ఓట్లను తొలగించడం లాంటి వ్యూహాత్మక చర్యలు జరుగుతున్నాయని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.







కామెంట్‌లు (0)