సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు పోరాటం

1 గంట క్రితం

ma bay
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 11:30 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- ​బారికేడ్లతో ప్రజాస్వామ్య ఆకాంక్షలను ఆపలేరు : ఎంఎ బేబీ

- మహిళా కార్యకర్తలపై లైంగిక వేధింపులు

- గాయాలను చూపిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నేతల ఆవేదన

- ఘటనలపై విచారణకు డిమాండ్‌

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ స్పష్టం చేశారు. వామపక్ష పార్టీలతో కలిసి నిరసనలను ఉధృతం చేయడంతోపాటు, ఇండియా బ్లాక్‌తో కలిసి పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుకొచ్చే సామాజిక శక్తుల ఉద్యమాలకు కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి నిరసన కార్యక్రమాలను రూపొందించి ముందుకు సాగుతామన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విస్తృత ఐక్య పోరాటాలు సాగిస్తామని వెల్లడించారు. సోమ‌వారం నాడిక్క‌డ సిపిఎం కేంద్ర కార్యాల‌యం (ఎకెజి భ‌వ‌న్‌)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం సీనియ‌ర్ నేత బృందా క‌ర‌త్‌, ఎస్ఎఫ్ఐ నేత‌ల‌తో క‌లిసి ఆయన మాట్లాడారు. దేశంలో శాంతియుత నిరసనలను రక్తసిక్తం చేసి అణచివేసే అనాగరిక పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి తొలుత ఉద్యమబాట పట్టిన పార్టీ సిపిఎం అని గుర్తుచేశారు. ఢిల్లీని యుద్ధభూమిగా మార్చి కేంద్ర ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నించినప్పుడు, దీనికి వ్యతిరేకంగా తొలుత సుప్రీంకోర్టును ఆశ్రయించింది కూడా తమ పార్టీయేనని తెలిపారు. జ్ఞానేష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా తదుపరి పోరాట కార్యాచరణను కేంద్ర కమిటీ సమావేశంలో రూపొందించినట్లు చెప్పారు. మోడీ, అమిత్‌షాలు చీమ కూడా చొరబడలేనంత పటిష్టంగా నిర్మించుకున్న భద్రతా వలయాలను ఛేదించి జంతర్‌మంతర్‌లో నిరసన తెలిపామని బేబీ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటాలకు మరింత బలాన్ని చేకూరుస్తామన్నారు. జ్ఞానేష్‌ కుమార్‌తోపాటు మోడీ, అమిత్‌షాలు కూడా రాజీనామా చేసి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. పౌర సమాజ సంఘాలు, మేధావులు, సాంస్కృతిక రంగ ప్రముఖులతో కలిసి ప్రజలను సమీకరిస్తామని తెలిపారు. బారికేడ్లు ఏర్పాటు చేయవచ్చని, కానీ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను ఏ నిర్బంధ శక్తీ, బారికేడ్లు అడ్డుకోలేవ‌ని ఆయన పేర్కొన్నారు.

ఎన్న‌డూ లేని అసాధార‌ణ ఘ‌ట‌న‌లు : బృందా కరత్‌

​ ఈ ఘటనలపై సిపిఎం సీనియర్ నాయకులు బృందా కరత్‌ తీవ్రంగా స్పందించారు. దశాబ్దాలుగా ఢిల్లీలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న తన అనుభవంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అసాధారణమైనవని ఆమె పేర్కొన్నారు. నిరసనకారులను భయభ్రాంతులకు గురిచేసేందుకు పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. యూనిఫాంలో ఉన్నవారితో లైంగిక వేధింపులు నిరసనలను అణచివేసే సాధనంగా మారాయని బృందా కరత్‌ విమర్శించారు.

మహిళా కార్యకర్తలపై లైంగిక వేధింపులు

​ ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పేర్కొన్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న అనంతరం పోలీసు వాహనాల్లోనూ కొట్టారని, మహిళా కార్యకర్తల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు. మీడియా సమావేశంలో గాయాలను చూపిస్తూ తమకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు. నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు అతిగా బలప్రయోగం చేశారని విమ‌ర్శించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

చేతులు, కాళ్లకు గాయాలు.. వినికిడి సమస్య

ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భార‌త అధ్యక్షుడు ఆదర్శ్‌ ఎం. సాజీ, స‌హాయ కార్య‌ద‌ర్శి ఐషే ఘోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షురాలు నదియా, శరణ్య తదితరులు మీడియా సమావేశంలో తమకు ఎదురైన ఘటనలను వివరించారు. పలువురు విద్యార్థుల చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని, కొందరికి ఎముకలు విరిగాయని ఐషే ఘోష్‌ తెలిపారు. తనకు తగిలిన గాయాలు ఇతర విద్యార్థులు ఎదుర్కొన్న హింసతో పోలిస్తే తక్కువేనని ఆమె పేర్కొన్నారు.

ఢిల్లీ ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షురాలు నదియా తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ, నిర్బంధ వాహనంలో మహిళా పోలీసుల బృందం తనపై దాడి చేసిందని తెలిపారు. తన స్నేహితురాలు పోలీసుల చర్యలను వీడియో తీయడానికి ప్రయత్నించగా, ఆరుగురు మహిళా పోలీసులు ఆమెను అడ్డుకునేందుకు యత్నించారని చెప్పారు. అదే సమయంలో మరో ఐదుగురు తనను చుట్టుముట్టి కొట్టారని తెలిపారు. ఓ పోలీసు తన చేతిపై కొట్టగా, మరొకరు జుట్టు పట్టి లాగారని, ఇంకొకరు వేలును మెలితిప్పి తీవ్రంగా నొప్పి కలిగించారని విమ‌ర్శించారు. కేరళకు చెందిన ఫిడెల్‌ అనే విద్యార్థిని పోలీసులు కుడి చెవిపై పలుమార్లు కొట్టడంతో వినికిడి సమస్య తలెత్తిందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. చికిత్స కోసం అతడిని ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

​మహిళా కార్యకర్తల పట్ల అసభ్య ప్రవర్తన

నిర్బంధ సమయంలో మహిళా కార్యకర్తల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. బస్సులోకి బలవంతంగా నెట్టే సమయంలో ఓ పోలీసు అధికారి తన కుర్తాను పైకి లాగారని ఓ మహిళా కార్యకర్త తెలిపారు. ఇరుకైన వాహనాల్లో మహిళలను నిర్బంధించిన సమయంలో పురుష పోలీసులు కూడా అక్కడే ఉన్నారని ఆమె విమ‌ర్శించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్