నాలుగు లేబర్ కోడ్లపై సిఐటియు సమరశంఖం
పోలీసులు ఆపితే అక్కడే *రెండు రోజుల బైఠాయింపు
విలేకరుల సమావేశంలో సిఐటియు నేతలు
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : కార్మికుల హక్కులను కాలరాస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనాన్ని రూ.42 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1న దేశవ్యాప్తంగా లక్షలాది కార్మికులతో పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు సిఐటియు నాయకులు ప్రకటించారు. బుధవారం నాడిక్కడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు ఢిల్లీకి తరలివచ్చి ఈ ఆందోళనలో పాల్గొంటారని తెలిపారు. 2019, 2020 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లను పార్లమెంటులో ఆమోదించిందని ఆయన విమర్శించారు. వామపక్ష పార్టీలు, ఇతర ప్రతిపక్షాలు వీటిని తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తుచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న 35 కోట్ల మంది కార్మికులతో దేశవ్యాప్త సమ్మె నిర్వహించినా కేంద్ర ప్రభుత్వం స్పందించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదన్నారు. ప్రభుత్వం స్పందించక పోవడంతోనే లక్ష మంది కార్మికులతో ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చామని చెప్పారు. డిసెంబర్ 1న ఉదయం 10 గంటలకు మార్చ్ ప్రారంభమవుతుందని, పోలీసులు ఎక్కడ అడ్డుకున్నా అక్కడే రెండు రోజులపాటు బైఠాయించి నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.
ప్రతి పది నిమిషాలకూ ఒక కార్మికుడు ఆత్మహత్య..
దేశంలో ప్రతి పది నిమిషాలకు ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకునే దుస్థితి నెలకొందని సిఐటియు అధ్యక్షుడు సుదీప్ దత్తా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక శాతమున్న కుబేరులపై అదనపు పన్ను విధించా లని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, కార్మికులకు రూ.42 వేల కనీస వేతనం, తగిన ఆదా యం కల్పించాలన్నారు. వచ్చే నెల 1న దేశ రాజధా నిని కార్మికులు తమ ఆందోళనతో హోరెత్తిస్తారని దత్తా అన్నారు. కార్పొరేట్లకు భారీ రాయితీలు కల్పించే నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పూర్తిగా విఫలమైనట్లు ప్రధానమంత్రి సైతం ఇటీవల అంగీకరించారన్నారు. ఈ విధానాలతో కొత్త ఉద్యోగాల కల్పన జరగలేదని, వేతనాలు పెరగలేదని, దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రరూపం దాల్చాయని విమర్శించారు.
మహిళా కార్మికులతో హోరెత్తనున్న మార్చ్..
పార్లమెంట్ మార్చ్‌లో 50 వేల మంది మహిళా కార్మికులు పాల్గొంటారని సిఐటియు జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధు తెలిపారు. ఆశా, అంగన్‌వాడీ తదితర పథకాల్లో పనిచేస్తున్న మహిళలు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. వారిని పూర్తిస్థాయి కార్మికులుగా గుర్తించి, ఉద్యోగ భద్రతతో పాటు అన్ని హక్కులు, ప్రయోజనాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ఆందోళనలో వేలాది మంది మహిళా పథక కార్మికులు భాగస్వాములవుతారని తెలిపారు.
సంపద కేంద్రీకరణ ప్రజాస్వామ్యానికి ముప్పు : ప్రొఫెసర్ జయతీ ఘోష్
ప్రపంచ సంపద కేంద్రీకరణ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోందని ఆర్థికవేత్త, ప్రొఫెసర్ జయతీ ఘోష్ అన్నారు. ‘‘ఇటీవల పారిస్‌లో ధనికస్వామ్యానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సదస్సు జరిగింది. జోసెఫ్ స్టిగ్లిట్జ్ వంటి నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరైన ఈ సదస్సు, ధనికస్వామ్యులు ప్రజాస్వామ్యానికే కాకుండా భూగోళానికే ముప్పు అని అంచనా వేసింది. ప్రస్తుత పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు పూర్తిగా విఫలమయ్యాయి. కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడంలో మితవాద ఆర్థిక విధానాలు విఫలమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అసమానత పెరుగుతోంది’’ అని జయతీ ఘోష్ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ ప్రభు మహాపాత్ర, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి ఎఎం జిగీష్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)