శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మతస్వేచ్ఛపై జోక్యం కూడదు : సిపిఎం ప్రధాన కార్యదర్శి బేబీ

2 గంటల క్రితం

మతస్వేచ్ఛపై జోక్యం కూడదు : సిపిఎం ప్రధాన కార్యదర్శి బేబీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌‌ వక్ఫ్‌ ‌బోర్డు ఛైర్‌‌పర్సన్‌ ‌చేసిన ప్రతిపాదనను సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ తీవ్రంగా ఆక్ష‍ేపించారు. మసీదుల్లో శుక్రవారం నాటి ప్రార్ధనల అనంతరం చేసే ప్రసంగాలు (సెర్మాన్‌) అన్నీ ఒకే రీతిన వుండాలని, ఆ ప్రసంగాలు ముందస్తుగా బోర్డు ఏర్పాటు చేసే కీలకమైన కమిటీ ఆమోద ముద్ర పొందాలన్న ప్రతిపాదనను ఆయన ఖండించారు. రాజ్యాంగం హామీ కల్పించిన మత స్వేచ్ఛను ఈ ప్రతిపాదన ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌‌లో పోస్టు పెట్టారు. తమకి ఇష్టమైన మతాన్ని స్వీకరించే, ఆచరించే, ప్రచారం చేసే స్వేచ్ఛను, అలాగే మతపరమైన గ్రూపులు మత విషయాల్లో తమ వ్యవహారాలను తామే నిర్వహించుకునే హక్కును రాజ్యాంగంలోని 25, 26 అధికరణలు పరిరక్షిస్తున్నాయని బేబీ పేర్కొన్నారు.

ఈ స్వేచ్ఛలను వినియోగించుకోవడం వల్ల ఇతరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినా లేక రాజ్యాంగం నిర్దేశించిన పరిధులను అతిక్రమిస్తే తప్ప ప్రభుత్వానికి ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని బేబీ స్పష్టంచేశారు.

‘మతపరమైన ఆదేశాలు, సూచనలు ఎప్పుడు, ఎవరు, ఎలా వినాలో ప్రభుత్వం నిర్ణయించాలంటే అది ఫాసిస్ట్ చర్య తప్ప మరొకటి కాదు.’ అని వ్యాఖ్యానించారు. ఇవి నియంతృత్వ పోకడలేనని ఆయన విమర్శించారు. అటువంటి నియంతృత్వ పోకడలను ఎన్నటికీ అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మసీదుల్లో చేసే ప్రసంగాలకు ముందస్తు పరిశీలన జరగాలనడం మత వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కిందకే వస్తుందని ఆయన పేర్కొన్నారు. మతపరమైన సంస్థల స్వయంప్రతిపత్తి పట్ల, అలాగే ప్రాధమిక స్వేచ్ఛల పరిరక్షణ పట్ల తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయన్నారు.

​

మత స్వేచ్ఛను గౌరవించాలి : తరిగామి

వక్ఫ్‌ ‌బోర్డు చైర్‌‌పర్సన్‌‌ చేసిన ప్రతిపాదన ప్రజల మత వ్యవహారాల్లో జోక్యం పట్ల తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోందని సిపిఎం సీనియర్‌ ‌నేత, కుల్గావ్‌ ఎంఎల్‌ఎ మహ్మద్‌ ‌యూసుఫ్‌ తరిగామి పేర్కొన్నారు. అటువంటి వ్యవస్థను రుద్దే ఉద్దేశ్యం లేదంటూ చైర్‌పర్సన్‌ నిరాకరించినా.. అసలు అటువంటి సూచనే మత వ్యవహారాల్లో అధికారుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన అన్నారు. మత వ్యవహారాల్లో మరింతగా ప్రభుత్వ జోక్యంపై ప్రజల ప్రతిస్పందన ఎలా వుంటుందో పరీక్షించడానికే ఇలాంటి ప్రతిపాదనలని ఆయన వ్యాఖ్యానించారు. లాంఛనంగా ఆదేశాలంటూ లేకపోయినప్పటికీ మత నాయకులు తమ ప్రసంగాల్లో (సెర్మాన్‌) ‌చెప్పేదాన్ని ప్రభావితం చేయడానికి అధికారులు ప్రయత్నించవచ్చనే ఆందోళనలు వున్నాయన్నారు. మత స్వేచ్ఛను గౌరవించాలి, మత సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీయరాదు. వక్ఫ్‌ ఆస్తులను నిర్వహించడం ఒక ఎత్తు అయితే, ప్రజలు తమ ఆరాధనా స్థలాల్లో ఏం వినాలోకూడా నిర్ణయించాలనుకోవడమ మరో ఎత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్