- ప్రగతిశీల శక్తులకు పెరుగుతున్న మద్దతు
- ఎంఎ బేబీ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విద్వేష రాజకీయాలపై ప్రజాగ్రహం పెరుగుతుందని, ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులకు మద్దతు లభిస్తుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు. బ్రెజిల్‌లో లూలా విజయం, ఇజ్రాయిల్‌లో నెతన్యాహూకు ఎదురైన ఎదురుదెబ్బ, సెర్బియాలో వుసిక్ పతనం. ఇవన్నీ విభజన, ద్వేష రాజకీయాలపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకతకు సూచికలన్నారు. ఈ పరిణామాలను ప్రధాని మోడీ, ఆయన అనుచరులు గమనించాలని తెలిపారు. అలాగే, లాస్‌ఏంజెల్స్ మేయర్‌గా ఎన్నికైన నిత్యా రామన్‌కు ఎంఎ బేబీ అభినందనలు తెలిపారు. భారతీయ మూలాలున్న తొలి మేయర్‌గా ఆమె సాధించిన విజయం చారిత్రాత్మకమన్నారు. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రెండు నగరాలు, దేశ రాజధానితో సహా స్వయంగా సోషలిస్టులమని చెప్పుకునే మేయర్లు బాధ్యతలు చేపట్టబోతున్నారని బేబీ అన్నారు. ఇళ్ల నిర్మాణం, వైద్యం, రవాణా, మౌలిక వసతుల వంటి మౌలిక సేవలను విస్తరించాలన్న ప్రజల ఆకాంక్షకు ఈ ఫలితం ప్రతిబింబమన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మితవాద, జాత్యహంకార రాజకీయాలను అమెరికన్లు తిరస్కరించారన్నారు. బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకంటే ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే ప్రజల అభిప్రాయమని బేబీ తెలిపారు.








కామెంట్‌లు (0)