ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనిర్దేశించే శక్తిగా గ్లోబల్‌ సౌత్‌

1 గంట క్రితం

PTI09_12_2026_000280B.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 06:59 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సదస్సును ప్రారంభిస్తూ ప్రధాని మోడీ పిలుపు

  • బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ : గ్లోబల్‌ సౌత్‌ ‌దేశాలు ‘నియమాలను నిర్దేశించే శక్తిగా మారాలి’ అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇకపై ఈ ‌దేశాలు నియమాలను పాటించే దేశాలుగా కాకుండా వాటిని నిర్దేశించే శక్తిగా, నిర్ణయాక క్రమంలో భాగస్వామిగా మారాలన్నారు. ప్రతి ఒక్క దేశానికీ తన స్వరం వినిపించే అవకాశం వుండాలి, ప్రతి సభ్య దేశానికీ వాటా వుండాలి. మానవాళి అభివృద్ధికి ప్రతి ఒక్కరి ప్రయత్నం, కృషి కీలకమేనని అన్నారు. ఇక్కడ భారత మంటపంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు-2026ను భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ ప్రారంభోపన్యాసం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

బ్రిక్స్‌ ‌మరింత బలోపేతం..

బ్రిక్స్‌‌ను మరింత బలోపేతం చేయడంతోపాటు, ప్రపంచ సంస్కరణల కోసం కూడా మనం మార్గాన్ని సుగమం చేయాలన్నారు. ‘‘ప్రస్తుత ప్రపంచ పాలనా విధానం (గ్లోబల్ గవర్నెన్స్) నిర్మాణం ఒక పిరమిడ్‌‌లా ఉంది. అధికారం, నిర్ణయాధికారాలు కేవలం పైనున్న కొన్ని దేశాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. కింది శ్రేణిలో ఉన్న దేశాలు ఆ నిర్ణయాల వల్ల ప్రభావితమవుతున్నప్పటికీ, వాటిని మార్చగల శక్తి వాటికి లేదు. అందుకే ఈ పద్ధతి మారాలి. ఇందుకోసం సంస్కరణలు చేపట్టాలి.’’ అని మోడీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో ఓటింగ్‌ అధికారాలు, నాయకత్వ పదవులు, విధాన ప్రాధాన్యతలనేవి ఆర్థిక వాస్తవికతలకు అనుగుణంగా వుండాలని స్పష్టం చేశారు.

ఇదో చారిత్రక సమావేశం

అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్‌ ఒక విశిష్టతను సంపాదించుకుందన్నారు. ఈ కూటమి ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఘర్షణలు, సమస్యల పరిష్కారం దిశగా బాధ్యతలు తీసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా గ్లోబల్ గవర్నెన్స్ మెరుగుపరచడానికి 10 సూత్రాలతో కూడిన ఒక సమగ్ర రోడ్‌మ్యాప్‌ను ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రతిపాదించారు.

‘‘ఈ ఏడాది బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్‌‌కు ప్రజలు, వారి సంక్షేమం, మానవత్వంతో కూడిన విధానాలు, వైఖరే ప్రధానం’’ అని మోడీ స్పష్టం చేశారు. స్థితిస్థాపకత (ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలు), ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలని అన్నారు. బ్రిక్స్ ఏర్పాటు చేసి ఇప్పటికి రెండు దశాబ్దాలు పూర్తయినందున ఈ ఏడాది ఇది చారిత్రక సమావేశమన్నారు. బ్రిక్స్‌ సభ్యదేశాల ప్రజలకు మనం భరోసా కల్పించాలి. పరస్పర సహకారంతో బ్రిక్స్ దేశాలు మరింత అభివృద్ధి చెందాలన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఈనాడు మానవాళి ఎదుర్కొంటున్న పలు సమస్యలకు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఘర్షణలకు మనం పరిష్కారం చూపించాల్సి వుందన్నారు.

‘మానవ జీవితంలో 20 ఏళ్ల వయసు పరిణతి చెందే దశ, నేడు బ్రిక్స్ కూడా సరిగ్గా ఇలాంటి పరిణితి చెందిన దశలోనే ఉంది. మనం ఒకరి దృక్పథాలను మరొకరం గౌరవించుకుంటూ, ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతున్నాం. మన విధానం ఎవరికీ వ్యతిరేకం కాదు. అందరినీ కలుపుకొనిపోవడమే మన లక్ష్యం. బ్రిక్స్ దేశాల ఐక్యతను, ఏకాభిప్రాయాన్ని ఇప్పుడు ప్రపంచ వేదికపై స్పష్టమైన ఫలితాలుగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని’ ప్రధాని మోడీ పేర్కొన్నారు. రాబోయే 20 ఏళ్లకు సరికొత్త, ప్రతిష్ఠాత్మకమైన ఎజెండాను రూపొందించాలని బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు ఏటా మారుతున్నప్పటికీ, దానివల్ల మన అభివృద్ధికి ఆటంకం కలగరాదని, ఇందుకోసం మన ఒక ప్రత్యేకమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. దీని వల్ల ఫలితాలను నిరంతరం పర్యవేక్షించడానికి వీలు కలుగుతుందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్