శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇక చాలు.. దిగిపోండి!

3 గంటల క్రితం

జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాల్సిందే
దేశవ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు
శాంతియుత ఆందోళనలపై ఢిల్లీలో ఉక్కుపాదం
ఎంపిలు ఎఎ రహీం, వి. శివదాసన్‌ సహా పలువురి అరెస్టు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 10:41 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- జ్ఞానేష్ కుమార్‌ రాజీనామాకు సర్వత్రా డిమాండ్‌

- దేశవ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు

- శాంతియుత ఆందోళనలపై ఢిల్లీలో ఉక్కుపాదం

- ఎంపిలు ఎఎ రహీం, వి. శివదాసన్‌ సహా పలువురి అరెస్టు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత, ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌)పై తలెత్తిన వివాదాల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్ ‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ ప్రధాన కార్యాలయం ‘నిర్వచన్‌ సదన్‌’ ఎదుట, జంతర్‌మంతర్‌ వద్ద ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.

ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నిరసనపై పోలీసుల దాష్టీకం

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌)ను రద్దు చేయాలని, ఎన్నికల సంఘంలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని పటేల్‌చౌక్‌ మెట్రో స్టేషన్‌ నుంచి భారత ఎన్నికల సంఘం కార్యాలయం వరకు శాంతియుతంగా చేపట్టిన ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. డివైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఎఎ రహీం, వి.శివదాసన్, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజి, నాయకులు ఎంఎల్‌ అభిజిత్‌, సూరజ్‌ ఇళమన్‌, మెహినాఫాతిమా, అనిల్‌ సేతుమాధవన్‌ సహా పలువురు నాయకులు, కార్యకర్తలను నిర్వచన్‌ సదన్‌ వద్ద ఢిల్లీ పోలీసులు, సిఎపిఎఫ్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు అడ్డుకున్నాయి. అఖిల భారత నాయకులతోపాటు మహిళలు, విద్యార్థి, యువ కార్యకర్తలపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఎంపిలు సహా నాయకులను పోలీసు వాహనాల్లోకి బలవంతంగా ఈడ్చుకెళ్లారు. మహిళా కార్యకర్తల పట్ల యూనిఫారంలో లేని పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై ఎస్ఎఫ్ఐ, డి వైఎఫ్ఐ తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. అదుపులోకి తీసుకున్న ఎంపిలు, నాయకులను చాలాసేపు వివిధ ప్రాంతాల్లో తిప్పిన అనంతరం మోతీనగర్‌, ద్వారక, ఢిల్లీ కాంట్‌ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. యూనిఫాం లేని పోలీసులు బలప్రయోగానికి పాల్పడటం పట్ల ఎంపిలు రహీం, శివదాసన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యవస్థపై తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఇసిపై చర్యలు తీసుకోకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అణచివేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. నాయకులు, కార్యకర్తలందరినీ తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలని, దాడికి పాల్పడిన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య వ్యతిరేక గళంపై అణచివేతను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

జంతర్‌మంతర్‌ వద్ద అరెస్టులు

జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలో సిపిఐ (ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌, ఐసా అధ్యక్షురాలు నేహా బోర్‌ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ ఝా, సామాజిక కార్యకర్తలు అంజలి భరద్వాజ్‌, సునీతా నరైన్‌ తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు. ప్రజలు తరలిరాకుండా పోలీసులు పలు మార్గాలను మూసివేశారు. దీంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పలు రాష్ట్రాల్లోనూ నిరసనలు

ఢిల్లీతోపాటు బీహార్‌, అస్సాం, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, జమ్ముకాశ్మీర్‌, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. సిఇసి జ్ఞానేష్‌కుమార్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఐద్వా ఆధ్వర్యాన జరిగిన నిరసనలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. కర్ణాటకలో జరిగిన నిరసనలో ప్రముఖ సినీనటుడు ప్రకాష్‌రాజ్‌ పాల్గొన్నారు.

పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నిరసనలు

కాంగ్రెస్‌ పిలుపు మేరకు ఆ పార్టీ ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా శుక్రవారం నిరసనలు జరిగాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌, హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ఒరిస్సా, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, నాగాలాండ్‌, అస్సాం ‌సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. రైసినా రోడ్డులోని ఢిల్లీ కాంగ్రెస్‌ ‌కార్యాలయం నుండి బిజెపి ప్రధాన కార్యాలయానికి, ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌ ‌కార్యాలయమైన నిర్వచన్‌ ‌సదన్‌‌కు ప్రదర్శనగా వెళ్లిన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీలో పటేల్‌చౌక్‌, జంతర్‌మంతర్‌, పటేల్‌చౌక్‌ మెట్రో స్టేషన్‌ పరిసరాల్లో గంటల తరబడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. సిమ్లాలోని ఎన్నికల కమిషన్‌ ‌కార్యాలయం వెలుపల హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టి, సిఇసి ‌దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. ఈ సందర్భంగా పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. భువనేశ్వర్‌‌లోని సిఇఓ కార్యాలయం వెలుపల ఒరిస్సా కాంగ్రెస్‌ ‌ఘెరావ్‌ ‌నిర్వహించడానికి ప్రయత్నించింది. సిఇఓ కార్యాలయానికి వెళుతున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. మేఘాలయలో జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌దిష్టిబొమ్మను కార్యకర్తలు దగ్ధం చేశారు. జమ్మూలో కాంగ్రెస్‌ ఎంపి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ‌సయ్యద్‌ ‌నజీర్‌ ‌హుస్సేన్‌ ‌నేతృత్వంలో ఆందోళన జరిగింది. అస్సాం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గౌహతిలో పార్టీ ప్రధాన కార్యాలయమైన రాజీవ్‌ ‌భవన్‌ ‌నుండి సిఇఓ రాష్ట్ర కార్యాలయం వరకు ప్రదర్శన జరిగింది. సిఇసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గౌరవ్‌ గొగోయ్‌తో పాటు పలువురు సీనియర్‌ ‌నేతలను పోలీసులు అరెస్టు చేశారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్