- మలప్పురం సిపిఎం నైట్ మార్చ్
మలప్పురం : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేరళంలోని మలప్పురంలో సిపిఎం ఆధ్వర్యాన నైట్ మార్చ్ నిర్వహించారు. కాగడాలు, ప్లకార్డులు, బ్యానర్లు , పార్టీ జెండాలను పట్టుకుని పలువురు నేతలు సిఇసి జ్ఞానేష్ కుమార్, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోట్లాది మంది పౌరులకు ఓటు హక్కును నిరాకరించటాన్ని సిపిఎం తప్పు పట్టింది. సంఘ్ పరివార్ ప్రయోజనాలకు అనుగుణంగా సిఇసి వ్యవహరిస్తున్నారని విమర్శించింది. ఈ ప్రదర్శనలో సాంప్రదాయ కళా ప్రదర్శనలతో పాటు ‘ఆజాదీ’ (స్వేచ్ఛ) నినాదాలు వినిపించాయి. సిపిఎం జిల్లా కమిటీ కార్యాలయమైన ‘ఇఎంఎస్ మందిరం’ వద్ద ప్రారంభమైన ప్రదర్శన పట్టణం మీదుగా సాగి ప్రభుత్వ తాలూకా ఆస్పత్రి వద్ద ముగిసింది. ముగింపు సభలో పార్టీ జిల్లా కార్యదర్శి వి.పి. అనిల్ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ ప్రతిజ్ఞలో పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎ. విజయరాఘవన్ , మాజీ మంత్రి కె.టి. జలీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయరాఘవన్ ప్రసంగిస్తూ బిజెపి ప్రభుత్వ హయాంలో మతతత్వం పెరుగుతోందని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రభావంతో భారత ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో చేపట్టిన ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) వల్ల దాదాపు 13 కోట్ల మంది తమ ఓటు హక్కును కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించిందని అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ , ప్రధాన మంత్రి కలిసి ఈ హక్కును ప్రజల నుంచి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. నిరసనలను అణచివేసేందుకు దేశ రాజధానిని బారికేడ్లు, పోలీసులతో నింపాశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గాయకులు పుష్పావతి , అతుల్ నరుకర ప్రదర్శనలు ఇచ్చారు.








కామెంట్లు (0)