జబల్‌పూర్ :
భోపాల్‌లోని శిథిలావస్థలో ఉన్న ఒక ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) ఇంటిని కూల్చివేయకుండా మధ్యప్రదేశ్ హైకోర్టు అధికారులను నిలువరించింది. సోమవారం రాష్ట్ర హౌసింగ్ బోర్డు, మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టతలపెట్టిన బుల్డోజర్ చర్యను సవాలు చేస్తూ ఇంటి యజమాని దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ మేరకు మధ్యంతర ఉపశమనం కల్పించింది.
కోర్టుకు వారాంతపు సెలవు రోజైన ఆదివారం నాడు జస్టిస్ విశాల్ మిశ్రాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భోపాల్‌లోని ఐష్‌బాగ్ ప్రాంతంలోని జనతా కాలనీ నివాసి మహ్మద్ హఫీజ్ ఖాన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 25వ తేదీకి వాయిదా వేసింది.
హౌసింగ్ బోర్డు అభివృద్ధి చేసిన కాలనీలో తనకు చెందిన 465వ నంబర్ ఇల్లు ఉందని ఖాన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరాయని ప్రకటించిన అధికారులు, సోమవారం వాటిని కూల్చివేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారని, ఆ కూల్చివేతపై స్టే విధించాలని పిటిషనర్ కోరారు.
విచారణ సందర్భంగా హౌసింగ్ బోర్డు, భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ తమ వాదనలు వినిపిస్తూ.. 1986లో నిర్మించిన ఈ ఇళ్లు పాతబడి, శిథిలావస్థకు చేరాయని, నివాసితుల భద్రతకు ఇవి పెనుముప్పుగా మారాయని తెలిపాయి. ఈ పథకంలో భాగంగా 600 జనతా క్వార్టర్లను నిర్మించగా, వాటిలో అర్హులైన లబ్ధిదారులకు కేవలం 110 మాత్రమే కేటాయించగలిగామని కోర్టుకు వివరించాయి. మిగిలిన క్వార్టర్లు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నాయి.
ఇళ్ల దుస్థితిని తెలియజేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఫొటోలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది. 2016 నుంచే కూల్చివేత నోటీసులు జారీ చేస్తున్నామని, నివాసితులకు అవగాహన కల్పించేందుకు కౌన్సెలింగ్ శిబిరాలు కూడా నిర్వహించామని అధికారులు తెలిపారు.
పునర్నిర్మాణ ప్రణాళిక కింద అర్హులైన కేటాయింపుదారులకు వారు ప్రస్తుతం నివసిస్తున్న విస్తీర్ణం కంటే అదనంగా 20 శాతం నిర్మాణ స్థలాన్ని ఇస్తామని హౌసింగ్ బోర్డు ప్రతిపాదించింది. తిరిగి ఇళ్లు నిర్మించి అప్పగించే వరకు ప్రత్యామ్నాయ నివాసం కోసం అద్దె చెల్లిస్తామని కూడా తెలిపింది.
అయితే, కలెక్టర్ ప్రతిపాదించిన నెలకు రూ. 1,200 నుంచి రూ. 1,500 అద్దె ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇంటిని కూల్చివేసే ముందే సహేతుకమైన అద్దెను ఖరారు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. దీనికి అంగీకరించిన హౌసింగ్ బోర్డు.. కలెక్టర్, పిటిషనర్‌తో సమావేశమై అద్దెను నిర్ణయిస్తామని కోర్టుకు హామీ ఇచ్చింది.
ఇరుపక్షాల వాదనలు విన్న ఏకసభ్య ధర్మాసనం, తదుపరి విచారణ జరిగే వరకు పిటిషనర్ ఇంటిని కూల్చివేయరాదని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.








కామెంట్‌లు (0)