8 మంది మృతి, ముగ్గురికి గాయాలు
గ్రావెల్ మిక్సింగ్ యంత్రానికి విద్యుత్ ప్రసారం కావడంతో ప్రమాదం
జైపూర్: రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయ్‌పూర్వతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛపోలి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
రోడ్డు నిర్మాణంలో భాగంగా తీసుకొచ్చిన కంకర (గ్రావెల్) మిక్సింగ్ యంత్రానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో యంత్రం మొత్తానికి కరెంట్ ప్రసరించింది. ఆ యంత్రాన్ని పట్టుకున్న కూలీలు విద్యుత్ షాక్‌కు గురై ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ముగ్గురిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అటవీ ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్డును బాగు చేసేందుకు స్థానికులు చందాలు వేసుకుని, ప్రైవేటుగా ఈ నిర్మాణ పనులు చేపట్టారని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.







కామెంట్‌లు (0)