బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతున్న విషయం పై బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దోషిగా తేలిన హసీనాను భారత్ నుంచి స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ విషయం పై ఇప్పటికే న్యూఢిల్లీకి పలుమార్లు విజ్ఞప్తి లేఖలు పంపినట్లు తెలిపారు. అయినా ఎటువంటి సమాధానం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నా దృష్టిలో హసీనా ఒక నేరస్థురాలు. మా ట్రైబ్యునల్ ఆమెను దోషిగా నిర్ధారించింది. బంగ్లాదేశ్ ప్రజలలో ఇదే ఆమెకు ఉన్న గుర్తింపు. హసీనాను ఎప్పటికైనా, ఎలాగైనా బంగ్లాదేశ్ కు తీసుకువస్తాం. తగిన శిక్ష విధిస్తాం. కానీ ఈ విషయంలో న్యాయ శాఖకు ప్రత్యక్ష ప్రమేయం ఉండదు. ఎందుకంటే ఆమె మరో దేశంలో ఉన్నారు కాబట్టి దీనిని హోం మంత్రిత్వ శాఖ చూసుకుంటోంది. ఒకవేళ వారు ఆమెను మాకు అప్పగిస్తే ఎటువంటి భావోద్వేగాలకు తావులేకుండా ఈ విషయాన్ని చట్టప్రకారం పరిష్కరిస్తాం. నిబంధనలు ఉల్లంఘించేలా మేం ఏమీ చేయబోం' అని అసదుజ్జమాన్ పేర్కొన్నారు. 2024లో విద్యార్థుల ఆందోళనలపై జరిగిన అణచివేతకు సంబంధించి 2025 నవంబరులో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును రాజకీయ ప్రేరేపితమైనదిగా హసీనా పేర్కొంటూ తిరస్కరించారు.








కామెంట్లు (0)