- స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలే కీలకం
- బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ
- బహులధృవ ప్రపంచానికి చోదక శక్తి గ్లోబల్ సౌత్ : షీ జిన్ పింగ్
- ముగిసిన శిఖరాగ్ర సమావేశాలు
- భారత్ నుండి చైనాకు అధ్యక్ష బాధ్యతలు
న్యూఢిల్లీ : భారత్ ఆతిథ్యమిచ్చిన రెండు రోజుల 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఢిల్లీలో ఆదివారం చివరి రోజు సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడారు. కూటమిలో పాల్గొన్న బ్రిక్స్ దేశాల నేతలకు, సహకరించిన అధికారులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి దార్శనికత, భవిష్యత్ సహకారానికి ఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందన్నారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్య ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సహకారం, సమ్మిళిత వృద్ధి ద్వారా బ్రిక్స్ కూటమి మరింత బలోపేతం కావాలని మోడీ పిలుపునిచ్చారు.
సభ్య దేశాల అభివృద్ధికి తోడ్పాటు..
బ్రిక్స్ వ్యాపార మండలి వివిధ సభ్య దేశాల అభివృద్ధికి గణనీయమైన తోడ్పాటు అందించిందని ప్రధాని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ముగింపు వ్యాఖ్యల్లో, సదస్సులో చురుకైన భాగస్వామ్యం, విలువైన సూచనలు అందించిన నేతలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన మోడీ, బ్రిక్స్ తన మూడో దశాబ్దంలోకి అడుగుపెడుతున్న వేళ, కేవలం ఆలోచనలు, హామీలు కాకుండా ప్రపంచం తమ నుంచి నిర్దిష్ట ఫలితాలను ఆశిస్తోందని, తదుపరి ఆతిథ్య దేశమైన చైనాకు తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. బ్రిక్స్ చైర్‌గా భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే నాలుగు మూలస్తంభాలపై దృష్టి సారించిందన్నారు. “కీలక ఖనిజాల ఆయుధీకరణ ఉమ్మడి వృద్ధికి అడ్డంకులు సృష్టించగలదు” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, అయితే బ్రిక్స్‌పై గ్లోబల్ సౌత్ దేశాల విశ్వాసం పెరిగిందన్నారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై బ్రిక్స్‌లో ఏకాభిప్రాయం కుదిరిందని, విపత్తు నిర్వహణ కోసం ముందస్తు హెచ్చరిక డేటా సమీకరణ మార్గదర్శకాలను రూపొందించినట్టు మోడీ వెల్లడించారు. ఈ మూడు రోజుల్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా వివిధ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలతో ప్రధాని మోడీ 15 ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు.
ప్రపంచం మారుతోంది: షీ జిన్‌పింగ్
న్యూఢిల్లీ సదస్సు రెండో రోజు ప్రసంగంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ, ప్రపంచం ఒక శతాబ్దంలో కనీవినీ ఎరుగని కీలక మార్పులకు గురవుతోందని, గ్లోబల్ సౌత్ దేశాలు సమిష్టిగా ఎదుగుతూ బహుళ ధ్రువ ప్రపంచానికి ప్రధాన చోదక శక్తిగా మారుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ పరిస్థితి సంక్లిష్టంగా, అస్థిరంగా మారుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు చొరవ తీసుకుని, గ్లోబల్ సౌత్‌లోని అత్యధిక దేశాలతో ఐక్యంగా నిలిచి, అంతర్జాతీయ వ్యవహారాల్లో సానుకూల, స్థిరమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సార్వభౌమ సమానత్వం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంతర్జాతీయ సంబంధాల ప్రాథమిక నియమావళిని గ్లోబల్ సౌత్ దేశాలు కాపాడుకోవాలని, ద్వంద్వ ప్రమాణాలు లేకుండా అంతర్జాతీయ చట్టాన్ని సమానంగా అమలు చేయాలని ఆయన సూచించారు. ఆచరణాత్మక సహకారానికి పునాదిని పటిష్టం చేసుకోవడం ద్వారానే బ్రిక్స్ గణనీయమైన పురోగతి సాధించగలదని పేర్కొన్న ఆయన, పారిశ్రామిక, సరఫరా వ్యవస్థల స్థిరత్వం కోసం ఐదు కొత్త కార్యక్రమాలను ప్రతిపాదించారు.
బ్రిక్స్ కోసం ఓపెన్- సోర్స్ ఎఐ జోన్ ప్రతిపాదన
బ్రిక్స్ దేశాల కోసం “కృత్రిమ మేధ (ఎఐ) ఓపెన్-సోర్స్ జోన్” ఏర్పాటుకు చైనా నేతృత్వం వహిస్తుందని షీ జిన్‌పింగ్ ప్రకటించారు. పెద్ద భాషా నమూనాల (ఎల్ఎల్‌ఎం) అభివృద్ధి, అనువర్తనాల్లో సహకారానికి మద్దతు ఇస్తామన్న హామీ కూడా ఇందులో భాగంగా ఉందని చైనా అధికారిక ప్రసార సంస్థ సిసిటివి వెల్లడించింది. ఈ నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చల నిమిత్తం షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎఐ సాంకేతికతపై ప్రపంచం నియంత్రణ కోల్పోతుందన్న ఆందోళనల నేపథ్యంలో, ఈ చర్చల్లో ఎఐ పాలనాంశం కూడా చోటుచేసుకునే అవకాశం ఉంది.“మన రెండు దేశాలు అనేక అంశాల్లో భిన్నంగా ఉన్నప్పటికీ, ఒకరి బలాలను మరొకరు పూర్తి చేసుకుంటూ, పరస్పరం మద్దతు ఇచ్చుకుంటూ, ఉమ్మడి విజయాన్ని సాధించి కలిసి ముందుకు సాగగలం” అని మోదీతో భేటీ సందర్భంగా షీ వ్యాఖ్యానించారు..
కొత్త బీమా యంత్రాంగం ప్రతిపాదించిన పుతిన్
ఒత్తిడితో నిమిత్తం లేకుండా పనిచేయగలిగే స్వతంత్ర మార్గాలు తమకు ఉన్నాయని పేర్కొంటూ, ప్రస్తుత ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర విధానాన్ని అనుసరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. బ్రిక్స్, గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక వృద్ధి కోసం కొత్త బీమా యంత్రాంగం, ధాన్యం మార్కెట్ కోసం ఒక సహకార కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించారు. రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు మాస్కోపై విధించిన తీవ్ర ఆంక్షల మధ్య పుతిన్ ఈ ప్రతిపాదనలు చేశారు. 18వ బ్రిక్స్ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ, తమ ప్రతిపాదనలను వినియోగించుకోవాలని ఇతర సభ్య దేశాలను ఆయన ఆహ్వానించారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి) 140 బిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తోందని కూడా పుతిన్ ప్రశంసించారు.
ఒకే ఫ్రేమ్‌లో ఆ ముగ్గురు..
ఈ సమావేశాల ముగింపు సందర్భంగా భారత్ మండపంలో బ్రిక్స్ దేశాధినేతలు ‘ఫ్యామిలీ ఫొటో’కు ఫోజిచ్చారు. ఇది నెట్టింట వైరల్ అయింది.
ముందు వరుసలో పుతిన్, మోడీ, జిన్‌పింగ్ పక్కపక్కనే నిలబడి నవ్వుతూ ఉన్న దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ముగ్గురూ వరుసగా మూడోసారి బ్రిక్స్ వేదికపై కనిపించడం విశేషం. భారత్, రష్యా, చైనా మధ్య ఉన్న కీలక దౌత్య సంబంధాలను ప్రతిబింబించే చిత్రంగా ఈ ఫొటో అంతర్జాతీయ మీడియాలోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, 2024లో కజాన్‌లో, 2025లో తియాంజిన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశాల తర్వాత ఇప్పుడు న్యూఢిల్లీలో ఈ ముగ్గురూ భేటీ అయ్యారు. కానీ, ఈసారి జిన్‌పింగ్ భారత్‌కు రావడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ఇరువైపులా ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఆయన పర్యటించడం గమనార్హం.
ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సహా పలువురు ప్రపంచ నేతలు హాజరయ్యారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా అస్థిరత, అమెరికా కొత్త సుంకాల విధానాల నేపథ్యంలో ఈ సదస్సు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.








కామెంట్‌లు (0)