సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ. 5 కోట్ల లంచం తీసుకున్న ఇన్స్‌పెక్టర్‌ అరెస్ట్

4 గంటల క్రితం

Inspector arrested for taking a bribe of Rs 5 crore
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 10:24 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

తమిళనాడు : ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్య వివాదంలో జోక్యం చేసుకుని, ఒక వర్గాన్ని కేసు నుంచి తప్పించేందుకు ఏకంగా రూ. 5 కోట్ల మేర లంచం డిమాండ్ చేసిన డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్‌ను సిబి సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. లంచం డబ్బుల లెక్కింపునకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.


తంజావూర్‌లోని రగుమాన్ నగర్‌కు చెందిన శరవణన్ కొందరు భాగస్వాములతో కలసి ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అయితే, కాలక్రమేణా భాగస్వాముల మధ్య ఆర్థిక లావాదేవీలపై తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి. ఇరువర్గాలు జోన్ ఐజి కార్యాలయంలో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అనంతరం శరవణన్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగించారు. ఈ కేసు విచారణ ప్రక్రియలో స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రత్యర్థి వర్గానికి కొమ్ము కాస్తున్నారని శరవణన్ ఆరోపించారు. పోలీసులు తనపై మోపిన కేసు తొలగించాలంటే భారీ స్థాయిలో నజరానా చెల్లించాలని ఒత్తిడి తెచ్చినట్లు శరవణన్ వెల్లడించారు. కేసు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు పోలీస్ అధికారులు రూ. 5 కోట్లు డిమాండ్ చేయడంతో ఆయన క్రైమ్ బ్రాంచ్, డిజిపి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఒప్పందంలో భాగంగా రూ. 3.75 కోట్లను నగదు రూపంలో, మిగిలిన రూ. 1.70 కోట్లను చెక్కుల రూపంలో జిల్లా నేర విభాగ ఇన్స్‌పెక్టర్ సుకుమారన్‌కు అందజేసినట్లు శరవణన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా సిబి సిఐడి బృందం అక్టోబర్ 9 న నాంజిక్కోటై రోడ్డులోని ఇన్స్‌పెక్టర్ సుకుమారన్ నివాసంలో ఆకస్మిక సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అనంతరం అక్టోబర్ 10న ఆయనను అధికారికంగా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.


తాజాగా బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగ్‌లో.. టేబుల్‌పై కట్టలుగా పేర్చిన రూ. 500 నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓ కుర్చీలో వ్యక్తి కూర్చుని ఉండగా, ఇరువైపులా నిలబడిన కొందరు వ్యక్తులు ఆ నోట్ల కట్టలను లెక్కిస్తున్నారు. అక్కడ ఓ మహిళ కూడా ఉన్నారు. నోట్లున్న సంచులను రహస్యంగా మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించడంతో ఈ వీడియో రికార్డయ్యింది.


అయితే ఇంత భారీ మొత్తం లంచం దందా వెనుక కేవలం ఇన్స్‌పెక్టర్ మాత్రమే కాకుండా ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇన్స్‌పెక్టర్ పంచాయితీ చేసి డబ్బులు వసూలు చేశారనే కోణంలో సిబి సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్