న్యూఢిల్లీ : విద్యార్థుల నిరసనకు జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ యాజమాన్యం దిగివచ్చింది. విద్యార్థి సంఘం రాజ్యాంగానికి ఆమోదం లభించిన 15 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని జామియా మిలియా ఇస్లామియా సోమవారం ప్రకటించింది. విద్యార్థులకు జారీ చేసిన సస్పెన్షన్ మరియు షో-కాజ్ నోటీసులను యూనివర్శిటీ రద్దు చేసింది. అలాగే, యాజమన్యంపై చేసిన పరువునష్టం కలిగించే వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని విద్యార్థులను కోరింది. రెండు వారాలుగా విద్యార్థులు నిరాహరదీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన యాజమాన్యం, వైస్-ఛాన్సలర్, చీఫ్ ప్రోక్టర్ రాజీనామాలపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో ఇద్దరు విద్యార్థులు తమ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. నిరసన సమయంలోభద్రతా సిబ్బంది ప్రవర్తనపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రిజిస్ట్రార్ ఎండి మహతాబ్ ఆలం రిజ్వీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎన్నికలపై నిర్వహణపై స్పష్టతనివ్వాలని , తమ యూనియన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ యూనివర్శిటీ విద్యార్థులు అక్టోబర్ 11 నుంచి నిరసన తెలుపుతున్నారు. నిరసన చేస్తున్న విద్యార్థులను బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నాలు జరగడంతో ఆదివారం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తరగతులను నిలిపివేయడంతో పాటు, క్యాంపస్‌లో నీటి సరఫరాను నిలిపివేశారు. ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. భారీగా పోలీసులను మోహరించినప్పటికీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో గుమిగూడి నిరసన చేపట్టారు.








కామెంట్‌లు (0)