కర్నాటక : కర్ణాటకలో నకిలీ మందుల విక్రయాలపై ఆహార, ఔషధ నియంత్రణ శాఖ (FDA) కొరడా ఝళిపించింది. నిబంధనలను ఉల్లంఘించిన 16 మంది రిటైలర్లు, హోల్‌సేలర్ల ఔషధ లైసెన్సులను రద్దు చేసింది. మరో ఎనిమిది లైసెన్సులను సస్పెండ్ చేసింది. నకిలీ మందుల తయారీ, ప్యాకింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో అధికారులు కీలక వివరాలను గుర్తించారు. డది సమీపంలోని కురుబరకెరనహళ్లి ప్రాంతంలో ఆగస్టు 18న అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడి ఓ ఫామ్‌హౌస్‌లో భారీగా నకిలీ మందులు, వాటిని ప్యాకింగ్ చేసేందుకు ఉపయోగించే సామగ్రి, యంత్రాలను గుర్తించారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.5.05 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు..
ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు ఔషధాలను కొనుగోలు చేసి, వాటిని కొత్త సీసాల్లోకి మార్చి ఖరీదైన మందులుగా విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ ఔషధ సంస్థల పేర్లను ఉపయోగించి నకిలీ లేబుళ్లను కూడా తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.
క్యూఆర్, స్కానింగ్ కోడ్‌లు పనిచేయలేదు
నకిలీ మందులపై ముద్రించిన క్యూఆర్, స్కానింగ్ కోడ్‌లను పరిశీలించగా అవి పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంలో నకిలీ లేబుళ్లను ఉపయోగించి మందులను అసలైనవిగా చూపించే ప్రయత్నం జరిగినట్లు నిర్థారణ అయ్యింది.
ఫైజర్ డిపో లైసెన్స్ తాత్కాలిక రద్దు ....
ఈ కేసు నేపథ్యంలో బెంగళూరు రూరల్ జిల్లాలోని ఫైజర్ సీ అండ్ ఎఫ్ డిపో లైసెన్స్‌ను కూడా అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేపట్టిన విచారణకు డిపో యాజమాన్యం సహకరించకపోవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. డిపోలో గడువు ముగిసిన 30 బాక్సుల మందులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఔషధాల నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. ల్యాబ్ పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వివరించారు.








కామెంట్‌లు (0)