ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు
జమ్మూకాశ్మీర్ వీధుల్లో ఆందోళనలు
మా హక్కులకై రాజీపడలేదు : ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసి ఏడేళ్లు కావడంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెళ్లువెత్తాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఆందోళనలు నిర్వహించాయి. ఆర్టికల్ 370ను 2019 ఆగస్టు 5న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల సందర్భంగా తమ గౌరవం, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ హామీ, ప్రజల విశ్వాసాన్ని తిరిగి చట్టబద్ధంగా, శాంతియుతంగా పునరుద్ధరించాలని జమ్మూ కాశ్మీర్ నేతలు డిమాండ్ చేశారు.
ఈ ఆందోళనల సందర్భంగా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ‘ఏడేళ్లు గడిచాయి, మేము మర్చిపోలేదు, రాజీపడలేదు, ప్రస్తుత పరిస్థితులను అంగీకరించడం లేదు. మా హక్కులను, మా గుర్తింపును కేంద్ర లాక్కుంది. జమ్మూ కాశ్మీర్‌కు జరిగిన అన్యాయాన్ని తిప్పికొట్టడానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు. నియోజకవర్గాల్లోనూ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) ఆందోళనలు నిర్వహించింది. అలాగే, ప్రతిపక్ష పిడిపి పిలుపు మేరకు జిల్లాల వారీగానూ నిరసనలు చేపట్టారు. అయితే తమ పార్టీకి చెందిన పలువురు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారని పిడిపి తెలిపింది. ఆగస్టు 5వ తేదీని "రాజ్యాంగాన్ని కోత పెట్టే దిశగా బిజెపి వేసిన మొదటి అడుగు"గా పిడిపి అధ్యక్షులు మెహబూబా ముఫ్తీ విమర్శించారు. అయితే ఎన్ని చేసినా జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలను చెరిపివేయలేరని, ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ముఫ్తీ స్పష్టం చేశారు.
కాశ్మీర్‌పై వ్యవస్థీకృత దాడి : సిపిఎం ఎమ్‌ఎల్‌ఎ తరిగామి
2019 ఆగస్టు 5న జరిగిన ఘటన, కేంద్ర ప్రభుత్వం, జమ్మూకాశ్మీర్ మధ్య ఉన్న సంబంధంపై జరిగిన ఒక వ్యవస్థీకృత దాడిగా సిపిఎం ఎమ్‌ఎల్‌ఎ తరిగామి అభివర్ణించారు. ఏడేళ్లు గడిచినా, రాజకీయ కార్యకలాపాలు, ప్రజాస్వామ్యం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛపైన కఠినమైన ఆంక్షలు, అణచివేత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ అణచివేతనే బిజెపి ప్రభుత్వం తాము సాధించిన అత్యంత గొప్ప విజయాలలో ఒకటిగా ప్రచారం చేసుకుంటోందన్నారు. నిరసన తెలిపే అవకాశాన్ని, పత్రికా స్వేచ్ఛను అణచివేయడానికి ప్రభుత్వం ఇప్పటికీ కఠినమైన, బలవంతపు చర్యలు చేపడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.








కామెంట్‌లు (0)