మలప్పురం : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారాన్ని నమ్మి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను ఉపయోగించిన కేరళంలోని 17 ఏళ్ల బాలిక తీవ్రమైన కిడ్నీ వ్యాధి భారినపడింది. మొటిమలు, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుందని ప్రచారం చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలను చూసి ఆ క్రీమ్‌ను ఆర్డర్ చేసి, ఏడాదిగా వినియోగిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం, స్పృహ కోల్పోవడం వంటి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని ఆ బాలిక చెప్పింది. కాళ్లకు వాపు రావడంతో నడవడానికి, మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడటంతో మలప్పురంలోని ఆస్టర్ మిమ్స్ మదర్ హాస్పిటల్లో చేరింది. తన ఆరోగ్య సమస్యల గురించి కంపెనీకి తెలియజేసినా, ఎటువంటి సానుకూల స్పందన రాలేదని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఆ బాలికకు చికిత్స అందిస్తున్న నెఫ్రాలజిస్ట్ (మూత్రపిండాల వైద్య నిపుణులు) ఎస్. గౌరి మీడియాతో మాట్లాడుతూ బాలిక రక్తం, శరీరంలో పాదరసం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వైద్య పరీక్షలలో గుర్తించినట్లు తెలిపారు. పాదరసం అధికంగా ఉన్న క్రీమ్ వాడటంతో, మూత్రపిండాలలోని వడపోత భాగాలను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పారు. ఆ అమ్మాయికి మెంబ్రేనస్ నెఫ్రోపతీ అనే తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి సోకిందని, దీనికి చికిత్స చేయకపోతే మరిన్ని సమస్యలకు దారితీయవచ్చని ఆమె తెలిపారు.ఆ క్రీమ్‌పై జరిపిన పరీక్షల్లో, సాధారణంగా అనుమతించదగిన స్థాయి ఒక పిపిఎం కంటే తక్కువగా ఉండగా, అందులో పాదరసం స్థాయి 12,500 పిపిఎం ఉన్నట్లు తేలిందని డాక్టర్ తెలిపారు.ఫెయిర్‌నెస్ క్రీముల ద్వారా తక్షణ ఫలితాలు లేదా చర్మపు రంగులో వేగవంతమైన మెరుగుదల ఇస్తామని వాగ్దానం చేసే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను డాక్టర్ గౌరి కోరారు. చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు అటువంటి ఉత్పత్తులపై ఆధారపడకుండా, చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలని ఆమె సూచించారు.
సోషల్ మీడియా ‘ఫెయిర్‌నెస్ క్రీమ్’ వాడిన కేరళ బాలికకు కిడ్నీ వ్యాధి
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 10:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)