శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బంగ్లాదేశ్‌లో రిసార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

1 గంట క్రితం

Fire at a resort in Bangladesh; 10 dead, 9 injured
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 05:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 9 మందికి గాయాలు.. మంటల్లో చిక్కుకున్న మరికొందరి వివరాలు తెలియాల్సి ఉంది


బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సముద్ర తీరంలోని ఓ రిసార్ట్‌లో శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్న మరికొందరి వివరాలు తెలియాల్సి ఉంది.


కాక్స్ బజార్ జిల్లాలోని ఇనాని ప్రాంతం, మెరైన్ డ్రైవ్ పరిధిలో ఉన్న పత్వార్టెక్ బీచ్ సమీపంలో ‘టుపుటుప్’ పేరుతో ఈ రిసార్ట్ నిర్వహిస్తున్నారు. మూడు అంతస్తులుగా ఉన్న ఈ భవనాన్ని పూర్తిగా వెదురుతో నిర్మించారు. శనివారం ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం వెదురుతో నిర్మించడంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్నవారు కిందికి చేరుకోలేక లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో రిసార్ట్‌లో సుమారు 30 మంది ఉన్నట్లు అంచనా. వారిలో నలుగురు లేదా ఐదుగురు మాత్రమే బయటపడగలిగినట్లు సమాచారం. మిగిలినవారు మంటల మధ్య చిక్కుకుపోవడంతో ప్రాణ నష్టం సంభవించింది.


సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు, భవనంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అధికారులు ఇప్పటివరకు 10 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన తొమ్మిది మందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మంటల్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా వెల్లడికాలేదు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. రిసార్ట్‌లోని వంటగదిలో చెలరేగిన మంటలే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్