- జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ : భారత తొలి ప్రధానమంత్రి, స్వతంత్ర సమరయోధుడు జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి సందర్భంగా శనివారం దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆధునిక భారత నిర్మాణ శిల్పుల్లో నెహ్రూ అగ్రగణ్యులని కొనియాడారు. న్యూఢిల్లీలోని ఆయన స్మారక స్థలం ‘శాంతివనం’లో కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళలర్పించారు. నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఘన నివాళులర్పించారు. దేశ పురోభివృద్ధికి నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు. పాత పార్లమెంటు భవనం (సంవిధాన్ సదన్) లోని సెంట్రల్ హాలులో జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కాంగ్రెస్ ఛీఫ్ విప్ కె సురేష్ తదితర నేతలు నివాళులర్పించారు. అయితే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు గైర్హాజరు అవ్వడంపై తృణమూల్ కాంగ్రెస్ నేత డీరెక్ ఒబ్రెయిన్ తప్పుబట్టారు. 29 మంది కేంద్ర కేబినెట్ మంత్రులలో ఒక్కరంటే ఒక్కరు కూడా నెహ్రూకు నివాళి అర్పించేందుకు రాలేదని, బిజెపి వాళ్లు చెప్పే సభ్యత, సంస్కారాలు, మర్యాద ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. వైవిధ్యమే బలంగానూ, ప్రజాస్వామ్యం విశ్వాసంగానూ, సమానత్వం పునాధి గానూ భారతదేశాన్ని నిర్మించాలని నెహ్రూ ఎనలేని కృషి చేశారని రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)