శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్‌

1 గంట క్రితం

Most-wanted gangsters arrested in America
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 11:47 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • లాస్‌ వెగాస్‌లో హిమాన్షు భాహూ, నీరజ్‌ ఫర్దిపురియాను అదుపులోకి తీసుకున్న అధికారులు


న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్లు హిమాన్షు భాహూ, నీరజ్‌ ఫర్దిపురియాలను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. హత్యలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటున్న వీరిద్దరినీ అక్టోబర్‌ 22న లాస్‌ వెగాస్‌లో ఒకే చోట అదుపులోకి తీసుకున్నారు. హర్యానా స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) అందించిన సమాచారంతో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ సహకారంతో ఈ అరెస్టులు జరిగినట్లు సమాచారం. నిందితులను భారత్‌కు అప్పగించే ప్రక్రియపై హర్యానా ఎస్‌టీఎఫ్‌ అధికారులు అమెరికా పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు.


హిమాన్షు భాహూపై పలు కేసులు ...

హిమాన్షు అసలు పేరు హిమాన్షు రిటోలియా. అయితే, హిమాన్షు సిగ్రోహ పేరుతో పాస్‌పోర్టు పొందినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కు ప్రత్యర్థిగా వ్యవహరిస్తూ నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. హర్యానా, ఢిల్లీ పోలీసుల మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న హిమాన్షుపై హత్యలు, కిడ్నాప్‌లు, బెదిరింపులకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇంటర్‌పోల్‌ నోటీసుల్లోనూ అతని పేరు ఉన్నట్లు తెలుస్తోంది. పోర్చుగల్‌లోని క్రిమినల్‌ నెట్‌వర్క్‌లతో పాటు నీరజ్‌ భవానా, నవీన్‌ బాలి గ్యాంగ్‌లతోనూ అతనికి సంబంధాలున్నట్లు సమాచారం.


నీరజ్‌ ఫర్దిపురియాపై 25 క్రిమినల్‌ కేసులు ...

మరో గ్యాంగ్‌స్టర్‌ నీరజ్‌ ఫర్దిపురియా హర్యానాలోని పాల్వాల్‌ జిల్లాకు చెందినవాడు. అతనిపై మొత్తం 25 క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు సమాచారం. 2012లో హర్యానా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 2015లో ఓ హత్య కేసులో జీవిత ఖైదు విధించారు. అయితే, 2019లో హర్యానా, పంజాబ్‌ కోర్టు అతనికి బెయిల్‌ మంజూరు చేసింది.


కాంగ్రెస్‌ నేత వికాస్‌ చౌదరి హత్య కేసులోనూ నీరజ్‌ పేరు ప్రస్తావనకు వచ్చింది. అనంతరం దుబాయ్‌ మీదుగా కెనడాకు పారిపోయిన అతను, అక్కడ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు ప్రత్యర్థిగా ఉన్న మరో ముఠాకు నాయకత్వం వహించినట్లు సమాచారం. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి హిమాన్షు భాహూతో కలిసి పనిచేసినట్లు తెలుస్తోంది. యూట్యూబర్‌ ఎల్విష్‌ యాదవ్‌ ఇంటిపై జరిగిన కాల్పుల ఘటనలోనూ నీరజ్‌ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను భారత్‌కు తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులు తదుపరి చర్యలు చేపడుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్