న్యూఢిల్లీ : న్యాయ విద్యను అభ్యసించేందుకు ఇకపై వయో పరిమితి లేదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) శుక్రవారం స్రుపీంకోర్టుకు తెలిపింది. మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశానికిఉన్న గరిష్ట వయోపరిమితిని ఉపసంహరించుకున్నట్లు బిసిఐ కోర్టుకు తెలిపింది. బిసిఐ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్న భారత ప్రధాన న్యాయూమర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం వయోపరిమితికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.
బిసిఐ వారి న్యాయ విద్య నిబంధనలు 2008 ప్రకారం.. ఐదేళ్ల లాకోర్సులో ప్రవేశం కోసం జనరల్ అభ్యర్థులకు 20 ఏళ్ల గరిష్ట వమోపరిమితి, నిర్దిష్ట రిజర్వ్డ్ కేటగిరీలకు ఐదేళ్ల సడలింపు ఉంది. మూడేళ్ల లా కోర్సు కోసం గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు కాగా, కొన్ని కేటగిరీలకు ఐదేళ్ల సడలింపు ఉంది. వయోపరిమితి నిబంధనలపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది.
చట్టం ముందు సమానత్వం (ఆర్టికల్ 14)ను ఈ నిబంధన ఉల్లంఘిస్తోందని ఏకసభ్య కమిటీ నిర్ధారించిన తర్వాత, బిసిఐ తన 2008 నిబంధనల షెడ్యూల్ 3లోని క్లాజ్ 28ను (వయోపరిమితికి సంబంధించినది) 2013లో ఉపసంహరించుకుంది. అయితే, అనంతరం పలు పిటిషన్లతో 2016 సెప్టెంబర్‌లో బిసిఐ మరో నోటీసులో వయోపరిమితులను పునరుద్ధరించింది. అప్పటి నుండి ఈ నిబంధన చెల్లుబాటును పలు న్యాయస్థానాల్లో సవాలు చేశారు. ప్రస్తుతం బిసిఐ నిబంధనను సవాలు చేస్తూ రిషబ్ దుగ్గల్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.







కామెంట్‌లు (0)